నెల్లూరు డీఎస్పీని కలిసి వినతి పత్రం అందించిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు

14 Jul, 2021 15:02 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: సినీ క్రిటిక్‌, నటుడు కత్తి మహేశ్‌ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్‌ జరిగిన ప్రమాదం తీరు చూస్తుంటే అనుమానంగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేశ్‌ కారు కుడి భాగం నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవర్‌ సురేశ్‌ స్వల్ప గాయాలతో బయటపడటం ఏంటని, ఎడమ వైపు కూర్చున్న మహేశకు తీవ్ర గాయాలవడం ఏంటని ప్రశ్నించారు. మహేశ్‌కు ఎంతో మంది శత్రువులు ఉన్నారన్నారని, గతంలోని దాడులు, కొన్ని సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు.

తొలుత కత్తి మహేశ్‌కు గాయాలే కాలేదని చెప్పారన్నారు. ఆసుపత్రిలో మహేశ్ ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు పెట్టారని చెప్పారు. కత్తి మహేశ్ మరణంపై విచారణ జరిపించాలని ఏపీ సర్కారును ఆయన కోరారు. అంతేగాక ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఈ రోజు నెల్లూరు జిల్లా రూరల్‌ డీఎప్సీని కలిసి కత్తి మహేశ్‌ మృతిపై విచారణ జరపాల్సిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీంతో సీఐ రామకృష్ణా రెడ్డి డ్రైవర్‌ సూరేశ్‌ను విచారణకు పిలిచి దర్యాప్తు జరుపుతున్నారు. దీనితో పాటు కత్తి మహేశ్‌ తండ్రి సైతం తన కొడుకు మృతిపై అనుమానం ఉందని తెలిపారు. కాగా, గత జూన్‌ 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద కత్తి మహేశ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు