నా రాజీ.. హృదయం ముక్కలవుతోంది: మందిరా బేడి

6 Jul, 2021 10:42 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి మందిరా బేడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త రాజ్‌ కౌశల్‌ను గుర్తుచేసుకుని ఉద్వేగపూరిత ట్వీట్‌ చేశారు. రాజ్‌ కౌశల్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న పాత ఫొటోను పంచుకున్న ఆమె... ‘‘నా రాజీ.. నీ ఆత్మకు శాంతి చేకూరుగాక. నా హృదయం ముక్కలైంది’’ అని ఎమోషనల్‌ అయ్యారు. కాగా సినీ దర్శకుడు రాజ్‌ కౌశల్‌(49) జూన్‌ 30న గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. 

ఈ క్రమంలో మందిరానే స్వయంగా భర్త అంత్యక్రియలు నిర్వహించారు. నిప్పు కుండ చేతబట్టి తానే అంతిమ సంస్కారాలు చేసి తనలోని సగ భాగానికి తుది వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు ఆమెపై విద్వేషపు విషం చిమ్మారు. కొడుకు ఉండగా, మందిర ఇలా ఎందుకు చేసిందంటూ విమర్శలు గుప్పించారు. అయితే, పలువురు సినీ ప్రముఖులు, సోషల్‌ మీడియా యూజర్లు మాత్రం మందిరకు మద్దతుగా నిలబడి ట్రోల్స్‌ను తిప్పికొట్టారు.

ఇక మందిర- రాజ్‌ కౌశల్‌ది ప్రేమ వివాహం. 1999లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2011లో కొడుకు వీర్‌ వారి జీవితాల్లోకి కొత్త సంతోషాలు తీసుకొచ్చాడు. అనంతరం ఈ జంట తార అనే బాలికను దత్తత తీసుకున్నారు కూడా. మందిర యాంకర్‌గా, నటిగా రాణిస్తుండగా, మై బ్రదర్‌ నిఖిల్‌, ప్యార్‌ మే కభీ కభీ వంటి సినిమాలు డైరెక్ట్‌ చేసిన రాజ్‌ కౌశల్‌.. సుమారు 800కు పైగా యాడ్స్‌ను ప్రొడ్యూస్‌ చేశారు. 


 

మరిన్ని వార్తలు