గుండె పగిలి ఆమె ఏడుస్తుంటే.. మీరిలా.. నిజంగా సిగ్గుచేటు

3 Jul, 2021 17:39 IST|Sakshi

మందిరా బేడిపై ట్రోల్స్‌.. కౌంటర్‌ ఇచ్చిన సోనా మొహాపాత్ర

ముంబై: ‘‘అయ్యో.. అదేమిటి.. కొడుకు ఉండగా భార్య అంత్యక్రియలు చేయడమేంటి? పైగా జీన్స్‌.. టీ షర్టు, చెప్పులు, చేతికి వాచీ.. ఆ అవతారమేమిటి. ఇదెక్కడి చోద్యం. ఎందుకు ఈమె ఇలా చేసింది. సెలబ్రిటీ అయితే మాత్రం ఏం చేసినా చెల్లుతుందా. అసలు ఏమనుకుంటోంది’’.. మందిరా బేడీని ఉద్దేశించి కొంతమంది నెటిజన్లు చేస్తున్న తీవ్ర విమర్శలు ఇవి. భర్త అంతిమ సంస్కారాలను స్వయంగా నిర్వర్తించినందుకు ఆమెను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించిందంటూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మందిరకు పలువురు సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. 

భర్తపై ఆమె ప్రేమను చూడాలే తప్ప.. ఇలా విద్వేషపూరితంగా వ్యవహరించడం సరికాదని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, సింగర్‌ సోనా మొహాపాత్ర మాత్రం ట్రోల్స్‌కు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. ఇంతకంటే పిచ్చితనం ఏమీ ఉండదంటూ మందిరను టార్గెట్‌ చేసిన వారికి చురకలు అంటించారు. ఈ మేరకు... ‘‘తన భర్త రాజ్‌ కౌశల్‌ అంత్యక్రియల సమయంలో మందిరా బేడి ధరించిన దుస్తులపై కొంతమంది ఇంకా విపరీతపు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇవేమీ కొత్తకాదు. మనల్ని ఆశ్చర్యపరిచేవీ కావు. మన ప్రపంచంలో స్టుపిడిటీ కంటే ఇంకేదైనా పెద్ద విషయం ఉండదు కదా’’అంటూ ట్విటర్‌ వేదికగా సెటైర్లు వేశారు. 

ఈ క్రమంలో పలువురు ఫాలోవర్లు సోనా పోస్టును అభినందిస్తున్నారు. ‘‘ ఆపత్కాలంలో సానుభూతి ప్రదర్శించాలే తప్ప.. ఆమె ఎలాంటి దుస్తులు వేసుకుంది. ఎలా రెడీ అయింది అంటూ కామెంట్లు చేయడం సిగ్గుచేటు. గుండె పగిలి ఆమె ఏడుస్తుంటే.. వీరికి మాత్రం కట్టూబొట్టూ గురించి కావాల్సి వచ్చిందా. మీరు చెప్పింది కరెక్ట్‌ సోనా. పిచ్చి పీక్స్‌కు వెళ్లింది చాలా మందికి’’ అంటూ మందిరకు అండగా నిలుస్తున్నారు. కాగా ప్రముఖ నటి మందిరా బేడి భర్త, ఫిల్మ్‌ మేకర్‌ రాజ్‌ కౌశల్‌(49) గుండెపోటుతో బుధవారం(జూన్‌ 30) కన్నుమూసిన విషయం విదితమే. ఈ క్రమంలో మందిరా తానే భర్తకు అంత్యక్రియలు నిర్వహించారు. వీరికి పదేళ్ల కుమారుడు వీర్‌, దత్తత కూతురు తార ఉన్నారు.  


ఓ సింగింగ్‌ షోలో సోనా మొహాపాత్ర

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు