Mangli Bonalu Song 2021: 'దయచేసి దేవుళ్లను అపహాస్యం చేయకండి'

18 Jul, 2021 16:23 IST|Sakshi

తెలంగాణలో పండగల కన్నా ముందే పాటలు బైలెల్తయ్‌.. పండగకు వారం రోజుల ముందు నుంచే కొత్త పాటలు రిలీజైతయ్‌. దీంతో కొత్త పాటలను బాక్సులల్ల మోత మోగించేందుకు రెడీ అయితరు ఊరి జనాలు. ఈసారి బోనాల పండక్కి కూడా మధుప్రియ, మంగ్లీతో సహా ఇంకెంతోమంది కొత్త పాటలు విడుదల చేశిర్రు. అయితే మంగ్లీ పాడిన 'చెట్టు కింద కూసున్నవమ్మ..' పాటకు కొంతమంది ఫిదా అయిపోతుంటే మరికొంత మంది మాత్రం దేవుడిని పొగుడుతుండ్రా? తిడుతుండ్రా? అని గుర్రుగా చూస్తుర్రు. మొత్తానికి ఈ సాంగ్‌ మాత్రం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఈ పాటల ఏముందో చూసేద్దాం...

బోనం అంటేనే డప్పుచప్పుళ్లు, దరువులతో దద్దరిల్లిపోతుంది. అయితే జానపద గాయని మంగ్లీ పాడిన చెట్టుకింద కూసున్నవమ్మ.. పాటలో ఎక్కడా డప్పు చప్పుళ్లకు చోటివ్వలేదు. ఇకపోతే పాటలో పాడిన కొన్ని పదాలు విమర్శలకు సైతం తావిచ్చాయి. చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మ.. అంటూ సాగే ఈ పాటలో అమ్మవారిని మోతెవారిలాగ కూసున్నవ్‌ అనడంతో కొందరు భక్తులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.

'అమ్మవారిని అంత మాటంటావా? అది తల్లిని మొక్కినట్లు లేదు, తిడుతున్నట్లుంది. గతంలో ఎంతో మంచి పాటలు పాడావు. ఇప్పుడేంటి? ఇలా పాడుతున్నావు. భక్తి పేరుతో దేవుళ్లను అపహాస్యం చేయకు' అంటూ మంగ్లీపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన మంగ్లీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు మరికొందరు. అయితే ఈ పాట రాసింది రామస్వామి అని, మంగ్లీ కేవలం ఆ సాంగ్‌లో ఆడిపాడిందని ఆమెను వెనకేసుకొస్తున్నారు అభిమానులు. ఇక జూలై 11న రిలీజైన ఈ పాటకు పండు కొరియోగ్రఫీ అందించాడు. దామూ రెడ్డి డైరెక్షన్‌ చేశాడు.

మరిన్ని వార్తలు