మణిరత్నం నవరసాలు.. గిటారిస్ట్‌గా క్లాసిక్‌ లుక్‌లో సూర్య

9 Jul, 2021 08:34 IST|Sakshi

శృంగారం, కరుణ, శాంతం, హాస్యం, అద్భుతం, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం... ఈ నవరసాల నేపథ్యంలో తొమ్మిది కథలతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ‘నవరస’. తొమ్మిది కథలను తొమ్మిది మంది దర్శకులు తెరకెక్కించారు.

‘గిటార్‌ కంబి మేలే నిండ్రు’ కథకు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించగా  సూర్య, ప్రయాగా మార్టిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌ రాజ్, రేవతి, అశోక్‌ సెల్వన్‌ ముఖ్య తారలుగా బిజయ్‌ నంబియార్‌ ‘ఎదిరి’కి దర్శకత్వం వహించారు. ‘పాయసం’ని వసంత్‌ తెరకెక్కించగా ఢిల్లీ గణేష్, రోహిణి, అదితీ బాలన్, కార్తీక్‌ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ‘సమ్మర్‌ ఆఫ్‌ 92’ని యోగిబాబు, రమ్యా నంబీశన్‌ కీలక పాత్రధారులుగా ప్రియదర్శన్‌ తెరకెక్కించారు.

కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించిన ‘పీస్‌’లో బాబీ సింహా, గౌతమ్‌ మీనన్, మాస్టర్‌ తరుణ్‌ కీలక పాత్రలు చేశారు. నటుడు అరవింద్‌ స్వామి దర్శకత్వం వహించిన ‘రౌద్రమ్‌’లో శ్రీరామ్, రిత్విక, అభినయశ్రీ తదితరులు కీలక పాత్రధారులు. కార్తీక్‌ నరేన్‌ తెరకెక్కించిన ‘ప్రాజెక్ట్‌ అగ్ని’లో అరవింద్‌ స్వామి, ప్రసన్న ప్రధాన పాత్రధారులు. సిద్ధార్థ్, పార్వతి ముఖ్య తారలుగా ఆర్‌. రతీంద్రన్‌ ప్రసాద్‌ ‘ఇనిమై’ని తెరకెక్కించారు. అథర్వా మురళి, అంజలి, కిశోర్‌ ముఖ్య తారలుగా సర్జున్‌ దర్శకత్వంలో ‘తునింద పిన్‌ రూపొందింది. ఈ తొమ్మిది భాగాల లుక్స్‌ని గురువారం విడుదల చేశారు. ఆగస్ట్‌ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

మరిన్ని వార్తలు