వివేక్‌ మరణంతో ఉద్వేగంలో వ్యాఖ్యానించా!

20 Apr, 2021 06:41 IST|Sakshi

సాక్షి, చెన్నై: సినీనటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ముందస్తు బెయిల్‌ కోసం సోమవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హాస్యనటుడు వివేక్‌ మరణంతో ఉద్వేగానికి లోనై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. వివేక్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న మరుసటి రోజున గుండెపోటుకు గురైన విషయం విధితమే. ఆ సమయంలో మన్సూర్‌ అలీఖాన్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యంగా ఉన్న మనిషిని వ్యాక్సిన్‌ పేరుతో మంచం ఎక్కించారని ఆరోపించారు. ఇంతో వివేక్‌ కన్నుమూయడంతో మన్సూర్‌ ఆగ్రహానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ను టార్గెట్‌ చేస్తూ విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ అనేది ప్రజలను గుప్పిట్లో ఉంచుకునేందుకు పాలకులు చేస్తున్న పొలిటికల్‌ స్టంట్‌గా విమర్శించారు.

మన్సూర్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం వైరల్‌ కావడంతో చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రకాష్‌ స్పందించారు.  మన్సూర్‌పై డీజీపీ త్రిపాఠీకి ఫిర్యాదు చేశారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో మన్సూర్‌పై వడపళని పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో మన్సూర్‌ అలీఖాన్‌ కోర్టును ఆశ్రయించారు. మిత్రుడిని కోల్పోయిన ఆవేదనలో వ్యాఖ్యానించానని, ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదని మన్సూర్‌ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. దీనిపై కోర్టు మంగళ లేదా బుధవారాల్లో విచారించే అవకాశముంది.

చదవండి:
ప్రభుత్వాలకు ధన్యవాదాలు: నటుడు వివేక్‌ సతీమణి
వ్యాక్సిన్‌కు, వివేక్‌ మృతికి సంబంధం లేదు

మరిన్ని వార్తలు