కొందరు దర్శకులు నన్ను మోసం చేశారు

15 Mar, 2021 00:02 IST|Sakshi

‘‘మోసగాళ్ళు’ సినిమా కోసం నా వద్ద ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టాను. సినిమా బాగా రావడంతో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకుల రిజల్ట్‌ కోసం చూస్తున్నాం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ‘మోసగాళ్ళు’ చిత్రం 10 నిమిషాల ప్రత్యేక వీడియోను  ప్రదర్శించారు. మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్‌ చేశాం. ఇంగ్లీష్‌ మినహా ఐదు భాషల్లో ఒకేరోజు నా సినిమా విడుదలవుతుండటం ఇదే మొదటిసారి. దీంతో చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఈ సినిమాలో సునీల్‌ శెట్టి మినహా అందరూ మోసగాళ్లే. నిజ జీవితంలో కొందరు దర్శకులు నన్ను మోసం చేశారు’’ అన్నారు.  కార్యక్రమంలో నవదీప్‌ పాల్గొన్నారు. 

ఉక్కు పోరాటం న్యాయమైనదే: మంచు విష్ణు
వైజాగ్‌ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైనదే. ‘వైజాగ్‌ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ అని 1962లో ఎన్నో ఆందోళనలు చేసి సాధించుకున్న పరిశ్రమ అది అని నాన్నగారు (మోహన్‌బాబు) కూడా చెప్పారు. నరేంద్ర మోదీగారు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు నేను పెద్ద అభిమానిని. కానీ ఇప్పుడు కాదు. కేంద్రం నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. ఉక్కు ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం అంటూ మంత్రి కేటీఆర్‌ చెప్పడం సంతోషం.  

చదవండి: (స్నేహం.. యాక్షన్‌.. థ్రిల్‌)

మరిన్ని వార్తలు