ఆసక్తికర విషయాలు వెల్లడించిన నీనా గుప్తా

29 Sep, 2020 18:11 IST|Sakshi

ఒకప్పటి బాలీవుడ్‌ హీరోయిన్‌ నీనా గుప్తాది విభిన్నమైన వ్యక్తిత్వం. తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడిస్తారు. యాభైలలో నీనా గుప్తా మాజీ వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో సహజీవనం చేయడం.. మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. రిచర్డ్స్‌తో విడిపోయిన తర్వాత 2008లో నీనా గుప్తా ఢిల్లీకి చెందిన వివేక్‌ మెహ్రాను వివాహం చేసుకున్నారు. అప్పుడు మసాబాకు 19 సంవత్సరాలు. అయితే వివేక్‌ను వివాహం చేసుకోవాలనుకుంటున్న విషయం గురించి మసాబాతో చెప్పినప్పుడు తాను ఎలా స్పందించింది అనే విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నీనా గుప్తా. (చదవండి: విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..)

ఈ సందర్భంగా నీనా గుప్తా మాట్లాడుతూ.. ‘వివేక్‌-నేను ఓ పదేళ్ల పాటు కలిసి తిరిగాము. తను నా కోసం ముంబై వచ్చేవాడు.. నేను అతడి కోసం ఢిల్లీ వెళ్లేదాన్ని. ఇవన్ని మసాబాకు తెలుసు. ఇక మేం పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు దీని గురించి మసాబాకు చెప్పాను. అప్పుడు తన వయసు 19 ఏళ్లు. పెళ్లి గురించి చెప్పగానే తను అడిగిన మొదటి ప్రశ్న.. ఎందుకు వివాహాం చేసుకోవాలనుకుంటున్నావు అని. అప్పుడు నేను ఈ సమాజంలో గౌరవంగా బతకాలంటే పెళ్లి తప్పని సరి అని చెప్పాను’ అన్నారు. అయితే దీని గురించి మసాబాతో చెప్పడానికి తాను కొంత ఇబ్బంది పడ్డానన్నారు నీనా గుప్తా. కానీ మసాబా నన్ను అర్థం చేసుకుంది. నా ఆనందం కోసం తను ఏమైనా చేస్తుంది. అది తనకు నచ్చినా.. నచ్చకపోయినా. కాబట్టి నేను ఆందోళన చెందలేదు అన్నారు. ఇక నీనా గుప్తా, వివేక్‌ మెహ్రాల వివాహం 2008లో జరిగింది. 

మరిన్ని వార్తలు