Rahul Yadav : 'ఎంత పెద్ద హీరో, హీరోయిన్లు అయినా నా సినిమాకి వర్క్‌షాప్‌ చేయాలి'

8 Dec, 2022 10:17 IST|Sakshi

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, హర్రర్ డ్రామా ‘మసూద’ వంటి విభిన్న కథలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియా సమావేశం నిర్వహించి తన జర్నీ గురించి పలు ఇంట్రెస్టింగ్‌ విశేషాలను పం‍చుకున్నారు.

 ‘మసూద’ సినిమా విజయం సాధించినందుకు, అందరి నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 

► హ్యాట్రిక్ అనిగానీ, నెంబర్స్ గురించిగానీ అస్సలు ఆలోచించలేదు. మంచి స్టోరీ. జెన్యూన్‌గా, హానెస్ట్‌గా, క్రమశిక్షణతో సినిమా తీస్తే.. జనాలకు నచ్చుతుంది. డబ్బులు కూడా వస్తాయని నమ్మాను. మొదటి సినిమా ‘మళ్లీరావా’ నుంచి ఇదే నమ్ముతున్నాను.

‘మసూద’ ఫస్ట్ డే తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన టాక్‌తో రోజురోజుకు థియేటర్లు పెరిగాయి. నా ఫస్ట్ సినిమా నుంచి శుక్రవారం సినిమా విడుదలైతే.. శనివారం నుంచే థియేటర్లు పెరుగుతూ వచ్చాయి.

►  స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ ఎంత చేస్తే అంత జనాల్లోకి ఆ సినిమా వెళుతుంది. మొదటి నుంచి సినిమాపై అంచనాలు ఉంటాయి కాబట్టి.. థియేటర్లకి ప్రేక్షకులు వస్తారు. కానీ ‘మసూద’ వంటి సినిమాలకు.. సినిమా బాగుంటే తప్పితే.. విడుదలకు ముందు ఎంత ప్రమోట్ చేసినా జనాలు పట్టించుకోరు. నేను సినిమా తీసే విధానంలో ఎంత జాగ్రత్త పడతానో.. ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. 

► బై ఛాన్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను ఇంజనీరింగ్ చేశాను. తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత ఓన్‌గా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో రియల్ ఎస్టేట్‌లోకి వచ్చాను. చిన్న ఫార్మా ఇండస్ట్రీ కూడా రన్ చేయాలని అనుకున్నాను. అట్లాంటి టైమ్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా గౌతమ్ నన్ను కలిశాడు. అతని గురించి చెప్పి.. ‘మళ్ళీరావా’ స్క్రిఫ్ట్ ఇచ్చాడు. మొత్తం చదివాను. నాకు చాలా బాగా నచ్చింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. 

► నేను టైమ్ ఎక్కువ తీసుకుంటాను. అలాగే నాకు వర్క్‌షాప్ కూడా చేయాలి. ఎంత ప్రూవ్‌డ్ యాక్టర్స్ అయినా.. కాంబినేషన్ సీన్స్ విషయంలో ఖచ్చితంగా వర్క్ షాప్ చేయాలి. కొత్త డైరెక్టర్స్‌తో రిస్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది అవసరం అని భావిస్తాను.

►  నేను సినిమా ఇండస్ట్రీకి వెళుతున్నానని చెప్పినప్పుడు.. ఇంట్లో అందరూ క్లాస్ తీసుకున్నారు. మా నాన్నగారు కొన్ని రోజుల పాటు మాట్లాడలేదు కూడా. ఈ ఒక్కసారికి నాకు సపోర్ట్ చేయండి. ఇది చేయలేకపోతే.. మీరు ఏది చెబితే అది చేస్తాను అని చెప్పా. నా బిగ్గెస్ట్ సపోర్ట్ నా వైఫ్, పిల్లలు, మా అమ్మనాన్న, నా చెల్లెలు, ఫ్యామిలీ. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేము. 

►  ‘మళ్ళీరావా’ సినిమాకి మా నాన్నగారు చాలా సపోర్ట్, ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు.

►  ‘మసూద’ సినిమాకు మాత్రం టెక్నికల్‌గా అద్భుతంగా తీయాలని అనుకున్నాను. ఏం జరిగినా సరే.. నేను అనుకున్నది చేశాను. ఒక పొరిగింటి వ్యక్తికి మంచి టైటిల్ ఏమీ దొరకక ‘మసూద’ అని పెట్టాం. 

► నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. పర్సనల్‌గా అయితే మాత్రం చిన్నప్పటి నుంచి వెంకటేష్‌గారంటే ఇష్టం.

►  డిసెంబర్ 8తో మా బ్యానర్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ బ్యానర్‌ స్థాపించినప్పుడు అనుకున్నదానికంటే.. ఎక్కువే సాధించానని అనుకుంటున్నాను. మూడు సినిమాలు తీస్తాననిగానీ, ఆ మూడు సక్సెస్ అవుతాయనిగానీ, ముగ్గురు దర్శకులని పరిచయం చేస్తాననిగానీ, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తాననిగానీ అనుకోలేదు. కానీ ఇవన్నీ జరిగాయి. అందుకే, నేను చాలా ఎక్కువే సాధించానని చెబుతాను. 

►  ఒక మంచి కథ, నాకు ఛాలెంజింగ్‌గా అనిపించాలి.. అలాంటి కథ దొరికితే వెంటనే తర్వాత చేయబోయే సినిమా అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంకా ఏ కథ చదవలేదు. స్క్రిప్ట్స్ మాత్రం 2019 నుంచి నా టేబుల్ మీదే ఉన్నాయి. దాదాపు 30 కథలు ఉన్నాయి. వాటిలో ఏదీ ఇంకా చదవలేదు.

► మా సంస్థను, మా సంస్థ నుంచి వస్తున్న సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సహకరిస్తున్న మీడియావారికి, శ్రేయోభిలాషులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మరిన్ని వార్తలు