విడుదలకు ముందే బహుమతి.. బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారా? డైరెక్టర్‌ ట్వీట్‌ వైరల్‌

13 Oct, 2022 10:19 IST|Sakshi

‘బేబీ’ దర్శకుడికి కారుని బహుమతిగా అందించిన మాస్ ‘మూవీ మేకర్స్’ నిర్మాతలు

మాములుగా సినిమా రిలీజై విజయవంతం అయిన తర్వాత హీరోలు, దర్శకులతో పాటు టెక్నీషియన్స్‌కి బహుమతులు ఇస్తుంటారు నిర్మాతలు. ఎక్కువ లాభాలు తెచ్చిపెడితే ఖరీదైన గిఫ్టులు ఇస్తుంటారు. కాని సినిమా విడుదలకు ముందే, అది కూడా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్నప్పుడు గిఫ్టులు ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా దర్శకుడు, ‘కలర్ ఫోటో’ ఫేమ్‌ సాయి రాజేష్‌ విషయంలో అదే జరిగింది.

(చదవండి: కేసీఆర్‌ బయోపిక్‌ తీస్తా.. ఆర్జీవీ)

ఆయన దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘బేబీ’. ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే.ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న 'బేబీ' మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది.

తాజాగా ‘బేబీ’ చిత్రం రష్ చూసిన నిర్మాతలు ఎస్ కే.ఎన్‌, మారుతి దర్శకుడు సాయి రాజేష్ కు ఎం.జి.హెక్టార్ కారును బహుమతిగా అందించారు. చెప్పిన కథను అలానే అద్భుతంగా తెరకెక్కించినందుకుగాను ఆనందంతో ఈ బహుమతిని అందించారు. ఏదేమైనా ఈ సినిమా పై నిర్మాత ఎస్ కె ఎన్ మంచి నమ్మకంతో ఉన్నారు.

కాగా, తనకు బహుమతి అందించిన నిర్మాతలకు థ్యాంక్స్‌ చెబుతూ.. కాస్త వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు దర్శకుడు సాయి రాజేష్‌. ‘బాగా తీశాననే ఇష్టమో లేదా హిట్‌ కొట్టాల్సిందేనని బ్లాక్‌ మెయిలో తెలియదు కానీ మా నిర్మాతలు కారుని బహుమతిగా అందించారు. గురువుగారు మారుతికి, స్నేహితుడు ఎస్‌.కె.ఎన్‌లకు థ్యాంక్స్‌. బేబీ టీజర్‌ త్వరలోనే విడుదల  చేస్తాం. మీ అందరి సపోర్ట్‌ ఇలాగే కొనసాగాలి’అని సాయి రాజేష్‌ ట్వీట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు