Matarani Mounamidi Review: ‘మాటరాని మౌనమిది ’మూవీ రివ్యూ

19 Aug, 2022 12:47 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : మాటరాని మౌనమిది 
నటీనటులు : మహేష్ దత్త,శ్రీహరి ఉదయగిరి, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు
నిర్మాణ సంస్థ :రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్
దర్శకత్వం: సుకు పూర్వాజ్ 
సంగీతం : అషీర్ లుక్
సినిమాటోగ్రఫీ:చరణ్ 
విడుదల తేది: ఆగస్ట్‌ 19, 2022

మహేష్‌ దత్త, శ్రీహరి ఉదయగిరి హీరోలుగా, సోనీ శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘మాట రాని మౌనమిది’. ‘శుక్ర’ఫేం సుకు పూర్వాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో మల్టీ జోనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్‌ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
రామ్‌(మహేశ్‌ దత్త) చాలా కాలం తర్వాత తన భావ ఈశ్వర్‌(శ్రీహరి ఉదయగిరి)ని కలవడానికి అరకు వెళ్తాడు. అక్కడ ఓ పెద్ద బంగ్లాలో ఈశ్వర్‌ ఒక్కడే ఉంటాడు. ఓ రోజు బిజినెస్‌ పని మీద ఈశ్వర్‌ బయటకు వెళ్లగా.. రామ్‌ ఒక్కడే ఆ ఇంట్లో ఉంటాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. దీంతో రామ్‌ మేడపైకి వెళ్లి అక్కడ గది తలుపులు తెరచి చూడగా.. ఈశ్వర్‌ శవం కనిపిస్తుంది. భయంతో రామ్‌ ఇంటి నుంచి బయటకు పరుగులు తీస్తాడు.

ఎ‍క్కడికి వెళ్లాలో తెలియక రాత్రంతా హాల్‌లోనే గడుపుతాడు. అయితే మరుసటి రోజు ఉదయమే ఈశ్వర్‌ తిరిగి ఇంటికి వస్తాడు. అతన్ని చూసి రామ్‌ షాకవుతాడు. నువ్వు చనిపోయావు కదా మళ్లీ ఎలా వచ్చావని అడుగుతాడు. నేను చనిపోవడం ఏంటి.. అసలు ఏం జరిగిందని అడగ్గా.. రాత్రి జరిగిన విషయమంతా చెబుతాడు రామ్‌. డెడ్‌బాడీ ఎక్కడ ఉందో చూద్దాం పదా అని పైకి వెళ్లి చూడగా..అక్కడ రామ్‌ శవం కనిపిస్తుంది. రామ్‌ డెడ్‌బాడీ ఈశ్వర్‌కు, ఈశ్వర్‌ డెడ్‌బాడీ రామ్‌కి కనిపిస్తుంది. అలా ఎందుకు జరిగింది? నిజంగానే వాళ్లు చనిపోయారా? ఆ ఇంట్లో ఏంముంది? ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ‘మాటరాని మౌనమిది’అనే టైటిల్‌ ఎందుకు పెట్టారని తెలియాలంటే థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాల్సిందే. ​

ఎలా ఉందంటే..
లవ్‌ స్టోరీ, థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం ‘మాటరాని మౌనమిది’. దర్శకుడు సుకుమార్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉంది. సినిమాలో సస్పెన్స్, ట్విస్టులు ఉంటాయి కానీ.. స్లో నెరేషన్‌ మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో రామ్‌, సీత మధ్య వచ్చే కొన్ని సీన్స్‌ ఆకట్టుకుంటాయి. రామ్‌ ఉంగరం ధరించడం..ఇంట్లో ఏదో తిరిగినట్లు కనిపించి.. అది ఏంటో తెలియకుండా క్యూరియాసిటీ పెంచేశాడు దర్శకుడు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే అక్కడ మాత్రం దర్శకుడు కథను కామెడీగా మలిచాడు. అది అంతగా వర్కౌట్‌ కాలేదు.సెకండాఫ్‌లో సాగదీత సీన్స్‌ ఎక్కువగా ఉంటాయి. అయితే సీత ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఆకట్టుకుంటంది. మ్యాజిక్‌తో ఇం​కో ‍వ్యక్తిని సృష్టించడం.. సీతకు రామ్‌ ప్రపోజ్‌ చేయడం లాంటి సీన్లను ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. హారర్‌ చిత్రాలను ఆస్వాదించేవారిని ‘మాటరాని మౌనమిది’ అలరిస్తుంది. 

ఎవరెలా చేశారంటే..
రామ్‌ పాత్రకి మహేశ్‌ దత్త న్యాయం చేశాడు. అతనికిది తొలి చిత్రం. ఇక రామ్‌ భావ ఈశ్వర్‌గా శ్రీహరి ఉదయగిరి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి చుట్టే కథ ఎక్కువగా తిరుగుంది. ఇక క్లాసికల్‌ డ్యాన్సర్‌ సీతగా సోనీ శ్రీవాస్తవ మంచి నటనను కనబరిచింది. రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర తనది.  అర్చనా అనంత్,సునీల్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అషీర్ లుక్ నేపథ్య సంగీతం పర్వాలేదు. దంపుడు లచ్చి అనే పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.  
 

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు