Chiranjeevi: 'పండగులు, పబ్బాలు ఉండవు, ఇండస్ట్రీ కోసం ఎంతోమంది త్యాగం చేశారు'

1 May, 2022 15:23 IST|Sakshi

ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ కష్టపడే కార్మికులు సినీ పరిశ్రమలో ఉన్నారని చిరంజీవి అన్నారు. కార్మిక దినోత్సవరం సందర్భంగా హైదరాబాద్‌ యూసప్‌గూడలో నిర్వహించిన సినీ కార్మికోత్సవం కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'కార్మికులు ఉద్యమించి తెచ్చుకున్న పండుగ ఇది. 24గంటల్లో 8గంటలు శ్రామికులు పని చేస్తారు. కానీ సినిమా కార్మికులకు నిర్ణీత సమయం ఉండదు. అడవిలో ఉంటారు. చలిలో పనిచేయాలి. పండగలు, పబ్బాలు అన్న తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాము.

నాకింకా గుర్తుంది.. షూటింగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో నూతన ప్రసాద్‌కి తీవ్రగాయాలయ్యాయి.అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కూర్చీలో ఉండి క్లోజప్ షాట్స్‌లో నటించారు. వేరే ఇండస్ట్రీలో అయితే కోలుకునే వరకూ రేస్ట్ తీసుకుంటారు. సినీ పరిశ్రమ కోసం ఎంతోమంది తమ కుటుంబాలను త్యాగం చేశారు. డైరెక్టర్‌ కేబీ తిలక్‌ గారి భార్య చనిపోయిందని ఫోన్ వచ్చింది. ఓ పది నిమిషాలు సమయం తీసుకొని సినిమా నిర్మిస్తాను అని ఆయన చెప్పిన ఘటన నాకు ఇప్పటికీ గుర్తింది.

అలాగే అల్లూ రామలింగయ్య గారి తల్లి చనిపోయిన తర్వాత షూటింగ్‌కి వెళ్లారు. గుండెల నిండా విషాదం పెట్టుకొని మనకు నవ్వులు పంచారాయన. ఇక నా విషయం తీసుకుంటే.. జగదేకవీరుడు అతిలోకసుందరి కోసం 103జ్వరంతో బాధపడుతూ శ్రీదేవితో కలిసి డ్యాన్స్‌ చేశా. షూటింగ్‌ అనంతరం15రోజులు హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యాను. గాడ్‌ఫాదర్‌ సినిమా కోసం ముంబై, హైదరాబాద్‌ తిరగాల్సి వచ్చేది. నేను డల్‌గా ఉన్నానని చెబితే షూటింగ్‌ ఆగిపోయేది.

ఇక సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, వ్యాక్సినేషన్ ఇవ్వడం నా బాధ్యతగా భావించా.ఎప్పుడు ఏం సహాయం కావాల్సిన నేను ఎప్పుడూ అండగా ఉంటాను మీ చిరంజీవి ఎప్పుడూ కార్మికుడే' అంటూ చెప్పుకొచ్చారు. అదే విధంగా సినిమా ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా సహకరించారని, అందుకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు