నాతో అన్నీ షేర్‌ చేసుకునేవాడు: నాగబాబు ఉద్వేగం‌

21 Apr, 2021 09:40 IST|Sakshi

తమను ఆరాధించే అభిమానులను కుటుంబ సభ్యులుగా భావిస్తారు మెగా హీరోలు. వారికి ఎలాంటి కష్టమొచ్చినా సాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. గతంలో పలుమార్లు ఫ్యాన్స్‌ను ఆదుకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా వుంటే తాజాగా చిరంజీవిని ఎంతగానో ఇష్టపడే వీరాభిమాని ప్రసాద్‌రెడ్డి తుది శ్వాస విడిచాడు. చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలను నడిపించిన ఆయన ఇక లేడన్న విషయం తెలిసిన మెగా హీరోలు సోషల్‌ మీడియా ద్వారా అతడికి సంతాపం ప్రకటించారు. 'నా బ్లడ్‌ బ్రదర్స్‌ ప్రసాద్‌ రెడ్డి, వెంకటరమణ కరోనా బారిన మరణించారన్న వార్త నా హృదయాన్ని కలిచివేసింది' అని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఈ క్రమంలో మెగా బ్రదర్‌ నాగబాబు ఇన్‌స్టాగ్రామ్‌లో అతడితో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఊహ తెలిసినప్పటి చిరంజీవి అన్నయ్య అభిమానిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత భేదాలు లేకుండా వ్యవహరించేవాడని అతడి గొప్పతనాన్ని వివరించాడు. మన కులం - అభిమాన కులం... మన మతం - సేవామతం.. అని నిస్వార్థంగా పని చేశాడని చెప్పుకొచ్చాడు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన తమ్ముడు ప్రసాద్‌రెడ్డి మరణం కలచి వేసిందని ఉద్విగ్నతకు లోనయ్యాడు. వ్యక్తిగతంగా కూడా ప్రసాద్ ప్రతి చిన్న విషయాన్ని తనతో పంచుకునేవాడని గత జ్ఞాపకాల స్మృతులను తడుముకున్నాడు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తూ... అతని భార్య, పిల్లలకు తాము, తమ అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాసుకొచ్చాడు.

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

మరోవైపు సాయిధరమ్‌తేజ్‌ సైతం ప్రసాద్‌ రెడ్డి ఆకస్మిక మరణంపై స్పందించాడు. మెగా ఫ్యాన్స్‌కు ఓ మూలస్థంభం లాంటి వ్యక్తిని కోల్పోయాం. అతడి ఆత్మకు శాంతి కలగాలి. ఈ కష్ట సమయంలో ఆ దేవుడు వారి కుటుంబానికి మనోబలాన్ని అందించాలి.. అని ట్వీట్‌ చేశాడు.

చదవండి: రెమి‌డెసివిర్‌ అడిగిన దర్శకుడు: ఊహించని స్పందన

‘షాక్’‌ ఇచ్చిన దర్శకుడితో రవితేజ సినిమా!

మరిన్ని వార్తలు