Waltair Veerayya: ఆ కమిట్‌మెంట్‌కు నేను కట్టుబడి ఉంటాను.. ఆచరిస్తాను

28 Dec, 2022 03:18 IST|Sakshi

‘‘ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో మంచి  సినిమాలు, మంచి పాత్రలు చేయాలని మనం ఎలా ఆకలిగా ఉంటామో వంద, రెండొందలు చిత్రాలు చేసినా అదే ఆకలితో, కమిట్‌మెంట్‌తో ఉండాలి. అప్పుడే మన వృత్తికి న్యాయం చేయగలం. అది లేకపోతే సినిమాల నుంచి రిటైర్‌ అయిపోవాలి. ఆ కమిట్‌మెంట్‌కు నేను కట్టుబడి ఉంటాను.. ఆచరిస్తాను. ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ సంతోషం కోసం గొడ్డులా కష్టపడతాను’’ అని హీరో చిరంజీవి అన్నారు.

బాబీ కొల్లి (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి, శ్రుతీహాసన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. హీరో రవితేజ కీలక పాత్ర పోషించారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా జనవరి 13న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం షూటింగ్‌ మంగళవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా  నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ–‘‘బాబీ కథ చెప్పినప్పుడు బాగుందనిపించింది.

నిర్మాతలతో ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందన్నాను. నా హార్డ్‌కోర్‌ ఫ్యాన్‌ బాబీ ఈ మూవీలో నన్ను అద్భుతంగా చూపించాడు. ఎలాంటి సన్నివేశాలైనా డూప్స్‌తో చేయించడం నాకు ఇష్టం ఉండదు.. నేను చేస్తేనే సంతృప్తిగా ఉంటుంది.  వేరే హీరోలు ఇలా చేస్తారో లేదో తెలియదు కానీ, నాకు  తెలిసింది ఇదే.. ఇలాగే చేస్తాను’’ అన్నారు.  ‘‘అన్నయ్యకి(చిరంజీవి) నేను పెద్ద అభిమానిని. పైగా బాబీ అంటే  నమ్మకం. అందుకే ఈ సినిమా చేశాను’’ అన్నారు రవితేజ. 

‘‘2002లో గీతాఆర్ట్స్‌ ఆఫీసులో రక్తదానం చేసేందుకు వచ్చిన 50 మంది  చిరంజీవిగారి అభిమానుల్లో నేనూ ఒక్కణ్ణి. ఆయనతో సినిమా  చేయాలనే నా కల ‘వాల్తేరు వీరయ్య’తో తీరింది. సంక్రాతి బరిలో మా అన్నయ్యను దించాలని 94 రోజులు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేశాం’’ అన్నారు బాబీ. ‘‘సంక్రాంతి అనే పెద్ద పండగకి ఇలాంటి అద్భుతమైన సినిమాని మాకు ఇచ్చిన బాబీగారికి థ్యాంక్స్‌’’ అన్నారు వై.రవిశంకర్‌. ‘‘ఈ కథ విన్నప్పుడు ఆహా.. మళ్లీ మెగా హిట్‌ తప్పదు అనిపించింది’’ అన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్‌.

‘‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల నిర్మాతలు ఒక్కరే. రెండు సినిమాలు సంక్రాంతికి  రిలీజవుతున్నాయి. వాటిని ఎలా రిలీజ్‌ చేసుకోవాలనేది వాళ్ల ఇష్టం. అందులో నటుడిగా నా ప్రమేయం ఉండదు. రెండు సినిమాలు వారికి రెండు కళ్లు.. వాటిలో ఏ ఒక్క కన్నుని పొడుచుకోవాలనుకోరు కదా?’’ అన్నారు చిరంజీవి.  

మరిన్ని వార్తలు