Chiranjeevi: రాజకీయాల్లోకి వెళ్లి ఆమెతో నటించే చాన్స్‌ మిస్సయ్యాను

31 Mar, 2022 05:22 IST|Sakshi
నిరంజన్‌ రెడ్డి, స్వరూప్, తాప్సీ, చిరంజీవి, అన్వేష్‌ రెడ్డి

– చిరంజీవి

‘‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చిన్న సినిమా. పెద్ద మనసుతో చూస్తే, మిమ్మల్ని (ప్రేక్షకులు) రంజింపజేస్తుంది. నా మాట నమ్మి వెళ్లినవాళ్లకి నష్టం జరగదని భరోసా ఇస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె. దర్శకత్వం వహించారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 1న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఆచార్య’ తీస్తున్నప్పుడు నిరంజన్, అవినాష్‌కి ఎప్పుడు సమయం కుదిరిందో తెలియదు కానీ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ తీశారు. తాప్సీ, స్వరూప్‌ వంటి మంచి కాంబినేషన్‌లో ఈ సినిమా తీయబట్టే, ప్రీ రిలీజ్‌కి రావాలని నిరంజన్‌ అడగ్గానే వస్తానని చెప్పాను. ఈ సినిమా చూశాను.. అద్భుతంగా ఉంది. తాప్సీ, ముగ్గురు పిల్లలు చాలా బాగా నటించారు. విషయం, పరిజ్ఞానం, ప్రతిభ ఉన్న డైరెక్టర్‌ స్వరూప్‌. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చిన్న సినిమా అంటున్నారు కానీ రిలీజ్‌ అయ్యాక పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు.

నిర్మాతలు ఇన్‌వాల్వ్‌ కావాలి: కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే కాని నిరంజన్‌ ఓకే చెప్పడు. ‘ఆచార్య’ కూడా తను ఓకే అన్నాకే మా వద్దకు వచ్చింది. కథలో, కథల ఎంపికలో నిర్మాతల ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉండాలి. నిర్మాత అనేవాడు ఓ క్యాషియర్, ఫైనాన్స్‌ సపోర్ట్‌ చేసేవాడు అనేట్లుగా పరిస్థితి మారింది. దానికి కారణం నిర్మాతలు కాదు.. నిర్మాతలను కథల ఎంపికలో ఇన్‌వాల్వ్‌ చేయాలి. నా నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, కేఎస్‌ రామారావు, దేవీ వరప్రసాద్‌.. ఇలా ఎంతోమంది పూర్తిగా కథ, సంగీతం.. ఇలా అన్ని విషయాల్లో ఇన్‌వాల్వ్‌ అయ్యేవారు. దానివల్ల డైరెక్టర్స్‌తో పాటు నటీనటులకు ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా ఇప్పుడు నిర్మాతల చేతుల్లో నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుండటం బాధగా ఉంది. ఇలాంటి రోజుల్లో అలాంటి ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉన్న నా నిర్మాత నిరంజన్‌ అని చెప్పుకోవడం గర్వంగా ఉంది.

రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అనిపిస్తోంది
‘ఝుమ్మంది నాదం’ అప్పుడు తాప్సీని చూసి ‘వావ్‌.. ఎంత బాగుంది.. యాక్టివ్‌గా ఉంది’ అనుకున్నాను.. అప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లి, తనతో సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయాను. ఒక్కోసారి తాప్సీలాంటి వాళ్లని చూసినప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్‌ ఫీలవుతుంటాను. ‘మెయిన్‌ లీడ్‌గా తను నాతో చేసే అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వకూడదు (నవ్వుతూ).. తనని కమిట్‌ చేయిద్దాం.. నిర్మాత నువ్వే అవ్వాలి. స్టేజ్‌పై ఉన్న ఈ యంగ్‌ డైరెక్టర్స్‌లో లాటరీ వేసి ఒక్కర్ని ఓకే చేయ్‌’ అని నిరంజన్‌ని ఉద్దేశించి అన్నారు చిరంజీవి.

ఇంకా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెలుగు, భారతీయ చిత్రపరిశ్రమ గర్వించే సినిమా అయింది. ఇక ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ లాంటి సినిమాలను ఆదరించినప్పుడే ఎంతో మంది యంగ్‌ డైరెక్టర్స్, యంగ్‌ యాక్టర్స్‌కి ప్రోత్సాహంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మంచి డైరెక్టర్స్‌కి మంచి నటీనటులు తోడైతే ‘మిషన్‌ ఇంపాజిబుల్, ఆచార్య’ వంటి సినిమాలొస్తాయి’’ అన్నారు నిరంజన్‌ రెడ్డి.

తాప్సీ మాట్లాడుతూ– ‘‘హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారు? అని కొందరు అడుగుతున్నారు. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది మరచిపోకూడదు. నా ప్రయాణం తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది.. అందుకే తెలుగు సినిమాలు చేస్తా.. చేస్తూనే ఉంటా’’ అన్నారు.

మరిన్ని వార్తలు