Chiranjeevi: ఈ వార్తలకి, చర్చలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి: చిరంజీవి

14 Jan, 2022 18:13 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలను ఖండించిన చిరంజీవి అవన్ని ఒట్టి పుకార్లు అని సోషల్‌ మీడియా వేదికగా తేల్చేశారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి, చట్ట సభల్లోకి రావడం జరగదని స్పష్టం చేశారు. దయచేసి ఊహాగానాలను వార్తలుగా ప్రసారం చేయొద్దని కోరారు. ఈ వార్తలకు, చర్చలకు ఇప్పటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. 

'తెలుగు సినీ పరిశ్రమ కోసం, థియేటర్ల మనుగడ కోసం ఏపీ సీఎం జగన్‌ను కలిశాను. ఆ చర్చలను పక్కదోవ పట్టించే విధంగా రాజకీయ రంగు పులుముతున్నారు. వైఎస్సార్‌సీపీ నాకు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసిందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం.' అని మెగాస్టార్‌ చిరంజీవి తన ట్విటర్‌లో పేర్కొన్నారు.  
 


ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు కలిసిన చిరంజీవి గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశం చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను సీఎంకు వివరించానని చెప్పారు.

ఇదీ చదవండి: అందుబాటులో వినోదం

మరిన్ని వార్తలు