Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు.. అరుదైన పురస్కారానికి ఎంపిక

21 Nov, 2022 11:25 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. ఆయనను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపుతో గౌరవించింది. 2022 సంవత్సరానికిగాను భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌-2022 అవార్డును మెగాస్టార్ అందుకోనున్నారు. ఇప్పటికే గోవాలో చలన చిత్రోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కాగా... ఈ నెల 28 వరకు జరగనున్నాయి.

ఈ అవార్డుకు చిరంజీవి ఎంపిక కావడం పట్ల కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు.  దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో నటుడిగా రాణిస్తోన్న చిరంజీవి... 150 సినిమాలు పూర్తి చేసి తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని చిరంజీవిని కొనియాడారు. ఈ వేడుకల్లో 79 దేశాలకు చెందిన 280 చిత్రాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 1978లో సినీ రంగంలో అడుగుపెట్టిన చిరంజీవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారకమైన పద్మభూషణ్‌ 2006లో చిరంజీవిని వరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. చిరంజీవి 2012 నుంచి2014 వరకు కేంద్ర పర్యాటక మంత్రిగా సేవలందించారు. 

మరిన్ని వార్తలు