‘మా’ మెంబ‌ర్ షిప్ కార్డుతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సాయం

18 May, 2021 20:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నటి పావలా శ్యామల దీనగాధపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఆమెను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకున్నారు. ‘మా’ సభ్యత్వంతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ స‌భ్యులు క‌రాటే క‌ళ్యాణి, సురేష్ కొండేటి శ్యామల ఇంటికి చేరుకొని 'మా' అసోసియేషన్‌ కార్డు సహా 1,01,500 రూపాయల చెక్కును అందించారు. ఇక ‘మా’ మెంబ‌ర్ షిప్ కార్డ్ తో నెల‌కు 6 వేల చొప్పున ప్రతినెలా ఫించను రూపంలో అందుతుందని తెలిపారు. ‘మా’ సభ్యత్వం పొంది ఉంటే ఎవ‌రైనా ఆర్టిస్ట్ అకాల‌ మ‌ర‌ణం చెందితే వారికి రూ. 3ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉంటుంది. పావలా శ్యామల కూతురి వైద్యానికి సంబంధించి న్యూరో సిటీ సెంటర్ వైద్య నిపుణులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు.

ఇక చిరంజీవి తనకు సాయం చేయడం పట్ల పావలా శ్యామల ఆనందం వ్యక్తం చేశారు. గతంలోను ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు చిరంజీవి రూ. 2ల‌క్ష‌లు ఇచ్చి సాయం అందించారని, మళ్లీ ఇప్పుడు తనను ఆదుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'గతంలోనూ తీవ్ర మాన‌సిక వేద‌న‌ను అనుభవించాను. నా కుమార్తెకు టీబీ వ్యాధికి చికిత్స చేయించ‌లేని ప‌రిస్థితి. కాలు విరిగి తీవ్ర ఇబ్బందిలో ఉంటే.. అప్పుడు ఆ రెండు లక్షల ఆర్థిక సాయం న‌న్ను ఎంతో ఆదుకుంది. ఆ మేలు ఎన్న‌టికీ మ‌ర్చిపోలేను.

అప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ సాయం చేయ‌లేదు. కానీ నాకు మెగాస్టార్ కుమార్తె వ‌చ్చి  2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. వారికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. ఇప్పుడు ఈ క‌ష్టంలో మ‌రోసారి లక్షా పదిహేను వందల రూపాయలను చెక్ రూపంలో అందించారు.అంతేకాకుండా ప్రతి నెలా ఆరువేల రూపాయలు సాయం అందించేందుకు సాయ‌ప‌డ్డారు. మ‌న‌స్ఫూర్తిగా చిరంజీవి గారికి  నా ధ‌న్య‌వాదాలు' అని అన్నారు. ఇక చిరంజీవి సాయానికి 'మా' కమిటీ స‌భ్యులు సైతం ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  

చదవండి : పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్‌
పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో..

మరిన్ని వార్తలు