నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: మేఘనా రాజ్‌

17 Oct, 2020 20:30 IST|Sakshi

బెంగళూరు: కన్నడ నటుడు చిరంజీవి సర్జా జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన భార్య, నటి మేఘనా రాజ్‌ చిరును తలచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘హ్యాపీ బర్త్‌డే, మై వరల్డ్‌! అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను!’’ అని భర్త ఫొటో షేర్‌ చేసి ఉద్వేగపూరిత ​క్యాప్షన్‌ జతచేశారు. సంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులు చిందిస్తున్న చిరంజీవి ఫొటో చూసి ఆయన ఫ్యాన్స్‌ కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. త్వరలోనే చిరు తన బిడ్డ రూపంలో మళ్లీ తిరిగి వస్తారని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటూ మేఘనకు సూచిస్తున్నారు.(చదవండి: మేఘనా సర్జా సీమంతం వేడుక)

కాగా సీనియర్‌ హీరో అర్జున్‌ మేనల్లుడు, నటుడు అయిన చిరంజీవి సర్జా జూన్‌ 7న బెంగళూరులో మరణించిన విషయం విదితమే. 36 వయస్సులోనే గుండెపోటుతో ఆయన కన్నుమూయడం అందరినీ తీవ్ర వేదనకు గురిచేసింది. ఇక అప్పటికే గర్భవతి అయిన చిరు భార్య మేఘనను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అయితే భర్త భౌతికంగా దూరమైనా, తన మనసులో ఎప్పుడూ బతికే ఉంటారంటూ ధైర్యం కూడదీసుకున్న ఆమె, ఇటీవల భర్త కటౌట్‌ పక్కన పెట్టుకుని సీమంతం వేడుక చేసుకున్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అప్పట్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు