మేఘనా సర్జా సీమంతం వేడుక

5 Oct, 2020 18:30 IST|Sakshi

హీరో అర్జున్‌ మేనల్లుడు, నటుడు అయిన చిరంజీవి సర్జా కొద్ది నెలల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. మరణించే నాటికే అతడి భార్య గర్భవతి. ఈ క్రమంలో చిరంజీవి సర్జా సతీమణి మేఘన సీమంతం వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. భర్త జ్ఞాపకాలతో బ్రతుకున్న మేఘన చిరంజీవి స్టైల్‌గా నుంచున్నట్లు కటౌట్ తయారుచేయించి తన కుర్చీ పక్కనే పెట్టుకున్నారు. దూరం నుంచి చూస్తే చిరంజీవి నిజంగానే భార్య పక్కను నిలబడినట్లు ఉండటంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మేఘన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: మన బిడ్డ రూపంలో నిన్ను తీసుకొస్తా!)

ఈసందర్భంగా ‘నాకెంతో ప్రత్యేకమైన ఇద్దరు వ్యక్తులు. చిరు.. నువ్వు ఇలాగే కదా ఈ వేడుక జరగాలని కోరుకున్నావు. నువ్వు కోరుకున్న విధంగానే జరిగింది. ఇకపైనా జరుగుతుంది. ఐ లవ్‌ యూ బేబీ మా’ అని పేర్కొన్నారు. మేఘన షేర్‌ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు భావోద్వేగానికి గురి అవుతున్నారు. ‘చిరంజీవి కటౌట్‌ చూస్తుంటే‌ ఆయన నిజంగా వేడుకలో ఉన్నట్లే ఉంది’, ‘మేడమ్ మీకు అంతా మంచే జరగాలి. అలాగే మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నాం’ అని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక చిరంజీవి సర్జా కన్నడలో సుమారు 22 సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో ఆయన నటి మేఘనా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఛాతీ నొప్పితో ఇంట్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే మేఘన గర్భవతిగా ఉన్నారు. తన భర్త సజీవంగా లేకపోయినా... ఆయన జ్ఞాపకాలు తనతోనే జీవితాంతం ఉంటాయని మేఘన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు