‘మెరిసే మెరిసే’ మూవీ రివ్యూ

6 Aug, 2021 08:53 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : మెరిసే మెరిసే
నటీనటులు :  దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు
నిర్మాణ సంస్థ : కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాతలు : వెంకటేష్ కొత్తూరి
దర్శకత్వం: పవన్ కుమార్
సంగీతం :  కార్తిక్ కొడగండ్ల
సినిమాటోగ్రఫీ : న‌గేశ్ బానెల్
ఎడిటర్‌ :  మ‌హేశ్‌
విడుదల తేది : ఆగస్ట్‌ 6,2021

హుషారు, ప్లే బ్యాక్ సినిమాలతో మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నారు దినేష్ తేజ్. ఈ యంగ్‌ హీరో నటించిన తాజా చిత్రం ‘మెరిసే మెరిసే’ లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్ట్‌ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ‘మెరిసే మెరిసే’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ
బెంగళూరులో స్టార్టప్‌ కంపెనీ ప్రారంభించి విఫలమైన యువకుడు సిద్దూ(దినేష్‌ తేజ్‌). సొంతంగా ఎదగాలనే తన ఆలోచనకు ఆదిలోనే ఆటంకం ఎదురవుతుంది. దీంతో దినేష్‌ తీవ్ర నిరాశకు గురవుతాడు. ఆ మూడ్‌ నుంచి బయటకు వచ్చేందుకు తల్లిదండ్రుల సలహా మేరకు  హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతాడు. ఎలాంటి టెన్షన్స్‌ లేకుండా ఫ్రెండ్స్‌తో కలిసి లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తుంటాడు. కట్‌చేస్తే....ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణిలనుకునే వెన్నెల(శ్వేతా అవస్థి)కి లండన్‌లో డాక్టర్‌గా పనిచేసే హరీష్‌తో ఎంగేజ్‌మెంట్‌ అవుతుంది. పెళ్లికి 8 నెలల గ్యాప్‌ తీసుకుంటారు. ఈ గ్యాప్‌లో వెన్నెల హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతుంది. కాబోయే భర్త, అత్తలకు వ్యతిరేకంగా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ని మొదలు పెడుతుంది. ఈ క్రమంలో వెన్నెల, సిద్దులకు పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఎక్కడికి దారి తీసింది? ‘వసుంధర’బ్రాండ్‌ పేరుతో ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో రాణించాలకున్న వెన్నెల కోరిక నెరవేరిందా? ‘వసుంధర’పేరు వెనక సీక్రేట్‌ ఏంటి? వెన్నెల, లండన్‌ డాక్టర్‌ ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్‌కు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అనేదే మిగతా కథ

నటీ నటులు
హుషారు, ప్లే బ్యాక్ సినిమాలతో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న దినేష్ తేజ్.. మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో టాలెంట్‌ ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల తాను అనుకున్నది సాధించలేకపోయిన సిద్ధూ పాత్రలో దినేష్‌ ఒదిగిపోయాడు. హీరోలా కాకుండా పక్కింటి కుర్రాడిలా తెరపై కనిపించాడు. ఇక వెన్నెల పాత్రలో శ్వేతా అవస్తి పరకాయ ప్రవేశం చేసింది. పేరుకు తగ్గట్టుగానే తెరపై అందంగా, ఆకర్షనీయంగా కనిపించింది. తెలుగు ప్రేక్షకులకు శ్వేతా మరో క్రష్ అవుతుందనడంలో సందేహం లేదు. సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. 

విశ్లేషణ
తెలుగు వెండితెరపై ప్రేమ కథా చిత్రాలకు కొదవలేదు. ఇప్పటికే కొన్ని వందల ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. అయినప్పటికీ అలాంటి చిత్రాలకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు. లవ్‌స్టోరీలో కొంచెం కొత్తదనం ఉన్నా.. సినిమాను హిట్‌ చేస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే నూతన నటీనటులతో పాటు దర్శకులు ఎక్కువగా ప్రేమ కథలను ఎంచుకుంటారు. అయితే ఇటీవల కాలంలో లవ్‌ స్టోరీల కంటే లస్ట్‌ స్టోరీలే ఎక్కువగా వస్తున్నాయి. స్వచ్ఛమైన ప్రేమ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. అలాంటి అరుదైన చిత్రమే ‘మెరిసే మెరిసే’.జీవితంలో అనుకున్నది సాధించాలనుకునే యవతి, అనుకున్నది సాధించలేకపోయి నిరాశలో బతికే యువకుడి అందమైన ప్రేమ కథ ఇది. దర్శకుడు పవన్ కుమార్‌కి ఇది తొలి సినిమాయే అయినా.. ఆ విషయం తెరపై ఎక్కడా కనిపించదు.

మంచి ప్రేమ కథలో పాటు యువతకు ఓ మంచి మెసేజ్‌ని కూడా ఇచ్చాడు. హంగులు, ఆర్భాటాలకు వెళ్లకుండా సింపుల్‌గా కథను నడిపించాడు. కథలో ఎలాంటి ట్విస్ట్‌లు లేకపోవడం, నెమ్మదిగా సాగడం ఈ సినిమాకు కాస్త ప్రతికూల అంశమే. ఈ కథకు మరింత ఎమోషన్స్‌ని యాడ్‌ చేసే సినిమా స్థాయి మరోలా ఉండేది. అయితే ఓ యువతిలో ఎమోషనల్‌ కోణాన్ని మాత్రం తెరపై చక్కగా చూపించడంలో దర్శకుడు విజయం సాధించడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం కార్తిక్ కొడగండ్ల సంగీతం. ఒక పాటతో పాటు నేపథ్య సంగీతం అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు కార్తిక్‌. న‌గేశ్ బానెల్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని తెరపై అందంగా చూపించాడు. ఎడిటర్‌ మ‌హేశ్‌ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉంది. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు