రాజోలులో తండ్రి పేరుతో సుక్కు ఆక్సిజన్‌ ప్లాంట్‌, ప్రారంభించిన మంత్రి

26 May, 2021 14:56 IST|Sakshi
ఆక్సిజన్‌ యూనిట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి వేణు

సాక్షి, రాజోలు: కరోనా కట్టడిలో సినీ ప్రముఖులంతా భాగస్వాములు అవుతున్నారు.  కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతికి రోజురోజుకు కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఎర్పడి సమయాని వైద్యం అందక కోవిడ్‌ బాధితులు కన్నుమూస్తారు. ఈ తరుణంలో సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా ఆక్సిజన్‌ సిలిండర్లు పంపిణి చేస్తూ సామాన్యుల కోసం నడుంబిగిస్తున్నారు.

తాజాగా దర్శకుడు సుకుమార్‌ సైతం తన సోంతూరు రాజోలులో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. సుకుమార్‌ తండ్రి బండ్రెడ్డి తిరుపతి నాయుడు పేరున ప్రభుత్వ కమ్మునిటీ హెల్త్‌ సెంటరులో దాదాపు 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ఆక్సిజన్‌ యూనిట్‌ను మంగళవారం ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం సుకమార్‌కు ప్రభుత్వం తరపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి, రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ, సర్పంచ్‌ రేవు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దర్శకుడు సుకుమార్‌ తండ్రి బండ్రెడ్డి తిరుపతినాయుడి పేరున ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ యూనిట్‌ ద్వారా ఒక నిమిషానికి ఎనిమిది లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయవచ్చునన్నారు. రాజోలు ప్రభుత్వాస్పత్రిలో 10 కోవిడ్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, మరో 10 ఏర్పాటయ్యాయని చెప్పారు. మరో 10 బెడ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. సొంత ప్రాంతంపై మమకారంతో సుకుమార్‌ రూ.40 లక్షల సహకారం చేయడం స్ఫూర్తిదాయమన్నారు. సుకుమార్, డార్విన్‌ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

అదే విధంగా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో మోరిలో సుబ్బాయమ్మ ఆస్పత్రి ద్వారా 100 బెడ్లు, రాజోలు ప్రభుత్వాస్పత్రిలో 20 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాజోలు ఆస్పత్రిలో కోవిడ్‌ వార్డును మంత్రి, కలెక్టర్‌ పరిశీలించారు. రోగు లు ఇబ్బందులు పడకుండా ఆక్సిజన్‌ అందించాలని సూపరింటెండెంట్‌ ప్రభాకరరావుకు సూచించారు.

మరిన్ని వార్తలు