కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతా!

4 Feb, 2021 06:01 IST|Sakshi
ప్రీరిలీజ్‌ వేడుకలో లక్ష్మీ పార్వతి, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

– మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

‘‘ప్రపంచ ప్రఖ్యాత నిర్మల్‌ బొమ్మల నేపథ్యంలో, అంతరించిపోతున్న హస్తకళలు, కళాకారుల గురించి కృష్ణకుమార్‌ తీసిన ‘రాధాకృష్ణ’ను అంతా ఆదరించాలి’’ అని తెలంగాణ పర్యావరణ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. అనురాగ్, ముస్కాన్‌ సేథీ జంటగా నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. ‘ఢమరుకం’ శ్రీనివాసరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందింది.  టి.డి. ప్రసాద్‌ వర్మ దర్శకత్వంలో పుప్పాల సాగరికా కృష్ణకుమార్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ప్రీ రిలీజ్‌ వేడుకలో మంత్రి మాట్లాడుతూ–‘‘పూర్తిగా తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలోనే చిత్రీకరించిన సినిమా ఇది.

అందులోనూ నిర్మల్‌ కళాకారుల కష్టాల నేపథ్యంలో మంచి ఆశయంతో తీసినందున ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీనుకెళ్తాను’’ అన్నారు. ‘‘శ్రీనివాస్‌రెడ్డి పట్టుబట్టి ఈ సినిమాలో నాతో ఒక పాత్ర చేయించారు’’ అన్నారు ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి. ‘‘కేవలం ప్రేమకథా చిత్రంగానే కాక అంతరించి పోతున్న హస్తకళలను బ్రతికించాలని ఒక మంచి సందేశాన్ని ‘రాధాకృష్ణ’లో ఇస్తున్నాం’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు పుప్పాల సాగరిక కృష్ణకుమార్‌. ప్రసాద్‌ వర్మ, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, నటుడు అలీ, డిస్ట్రిబ్యూటర్‌ వరంగల్‌ శ్రీను తదితరులు మాట్లాడారు.

మరిన్ని వార్తలు