రావణాసుర షురూ

15 Jan, 2022 00:21 IST|Sakshi
సుశాంత్, సుధీర్‌ వర్మ, చిరంజీవి, రవితేజ, అభిషేక్‌ నామా

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ షురూ అయింది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్స్‌పై అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం భోగి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు చిరంజీవి క్లాప్‌ ఇచ్చారు. దర్శకులు కేయస్‌ రవీంద్ర (బాబీ), గోపీచంద్‌ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు.

దర్శకుడు కె. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. ఈ సందర్భంగా ‘రావణాసుర’ పోస్టర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్‌లో పేర్కొంది చిత్రబృందం. ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘రావణాసుర’ రూపొందనుంది. ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని అభిషేక్‌ నామా అన్నారు. సుశాంత్‌ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్, భీమ్స్, కెమెరా: విజయ్‌ కార్తీక్‌ కన్నన్, సీఈఓ: పోతిని వాసు.

మరిన్ని వార్తలు