Mission Impossible Review: ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ మూవీ ఎలా ఉందంటే..

1 Apr, 2022 14:04 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : మిషన్‌ ఇంపాజిబుల్‌ 
నటీనటులు : తాప్సీ, హరీశ్‌ పేరడీ, రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ తదితరులు
నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాత: నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి
దర్శకత్వం : స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె
సంగీతం : మార్క్‌ కె రాబిన్‌
సినిమాటోగ్రఫీ : దీపక్ యెరగరా
విడుదల తేది : ఏప్రిల్‌ 01, 2022

టాలీవుడ్‌లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెఫ్ట్‌ బాగుంటే చిన్న సినిమాలు కూడా భారీ విజయం సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే చాలు చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చిన్న చిత్రాలు ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి కూడా. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిన్న చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. చాలాకాలం తర్వాత తాప్సీ పన్ను తెలుగులో ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్‌ 1) రిలీజైన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

కథేటంటే..
శైలజ అలియాస్‌ శైలు(తాప్సీ) ఓ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాపై పరిశోధనలు చేస్తుంటారు. రామ్‌శెట్టి(హరీశ్‌ పేరడీ) అనే మాఫియా డాన్‌ని రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించాలని ఆమె ప్లాన్‌ వేస్తారు. బెంగళూరు నుంచి చిన్న పిల్లలను దుబాయ్‌కి తరలించేందుకు రామ్‌శెట్టి స్కెచ్‌ వేసినట్లు తెలుసుకున్న శైలు.. పక్కా ఆధారాలతో అతన్ని పోలీసులకు పట్టించి, పిల్లలను రక్షించాలని బయలుదేరుతుంది.

కట్‌చేస్తే.. తిరుపతికి చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం(ఆర్‌.ఆర్.ఆర్‌) అనే ముగ్గురు కుర్రాళ్లకు చదువు తప్ప అన్ని పనులు వస్తాయి. ఎలాగైనా డబ్బులు సంపాదించి, ఫేమస్‌ కావలనేదే వాళ్ల లక్ష్యం. డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్న క్రమంలో.. దావూద్‌ని పట్టిస్తే..రూ.50 లక్షల బహుమతి పొందొచ్చు అనే వార్త టీవీలో వస్తుంది. అది చూసి దావుద్‌ని పట్టించి, రూ.50 లక్షల బహుమతి దక్కించుకోవాలని ఆ ముగ్గురు.. ఇంట్లో చెప్పాపెట్టకుండా ముంబైకి బయలు దేరుతారు. మరి ఆ ముగ్గురు ముంబైకి వెళ్లి దావూద్‌ని పట్టుకున్నారా? మాఫియా డాన్‌ని పోలీసులకు పట్టించాలని చూస్తున్న శైలుకీ, దావూద్‌ని పట్టించి రూ.50 లక్షలు ప్రైజ్‌ మనీ పొందాలనుకున్న రఘుపతి, రాఘవ, రాజారాంలకు లింకు ఏంటి? అసలు వాళ్లు నిజంగానే ముంబై వెళ్లారా? మాఫియా డాన్‌ రామ్‌శెట్టిని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడంలో.. ఈ ముగ్గురు స్నేహితులు ఎలా సహాయపడ్డారు? శైలు మిషన్‌కి ఆర్‌.ఆర్.ఆర్‌ మిషన్‌ ఎలా ఉపయోగపడింది? ఈ మిషన్‌లో ఎవరు విజయం సాధించారు అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`అనే తొలి మూవీతో అందరి దృష్టి ఆకర్షించాడు దర్శకుడు స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె. ఆయన నుంచి మరో సినిమా వస్తుందంటే.. కచ్చితంగా ఓ మోస్తరు అంచనాలు ఉంటాయి. దానికి తోడు చాలా కాలం తర్వాత తాప్సీ టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తుండడంతో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’పై సినీ ప్రేక్షకులు భారీ హోప్స్‌ పెంచుకున్నారు. కానీ వారి అంచనాలను రీచ్‌ కాలేకపోయాడు దర్శకుడు స్వరూప్‌. కథలో కొత్తదనం లోపించింది. చాలా చోట్ల లాజిక్‌ మిస్‌ అవుతుంది.  ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ శైలుయే స్వయంగా ఓ పదిహేడేళ్ల కుర్రాడితో డాన్‌ను చంపించడం, దాన్ని సమర్థించేందుకు ఓ అంతుచిక్కని లాజిక్కుని చొప్పించడంతో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ కథ మొదలవుతుంది. రఘుపతి, రాఘవ, రాజారాం పాత్రల కామెడీతో ఫస్టాఫ్‌ అంతా సరదాగా సాగుతుంది. డబ్బులు సంపాదించే క్రమంలో పిల్లలు చేసిన అమాయకపు పనులు నవ్వులు పూయిస్తాయి. త్రివిక్రమ్‌, రాజమౌళి, సుకుమార్‌, పూరి జగన్నాథ్‌లపై వేసిన జోకులు కూడా బాగా పేలాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది.

ఇక సెకండాఫ్‌లో కథంతా ఇన్వెస్టిగేషన్‌ చుట్టే తిరుగుతుంది. అయితే చైల్డ్‌ ట్రాఫికింగ్‌, పిల్లలు పడే కష్టాలు.. ఇవన్నీ గత సినిమాల్లో చూసిన సీన్లలాగే అనిపిస్తాయి. కథలో ట్విస్టులు ఉండకపోవడమే కాకుండా.. లాజిక్‌ లేని సీన్స్‌ బోలెడు ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ముంబై, బొంబాయి రెండూ ఒకటేనని కూడా తెలియని పిల్లలు.. సెకండాఫ్‌కు వచ్చేసరికి చాలా తెలివిగా వ్యవహరించడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు అయిన శైలజ.. ఓ ప్రమాదకరమైన మిషన్‌కి ముగ్గురు పిల్లలను అడ్డుపెట్టుకోవడం.. సగటు ప్రేక్షకుడికి మింగుడుపడదు. హరీశ్‌ పేరడీ విలనిజం కూడా అంతగా పేలలేదు. క్లైమాక్స్‌ కూడా చాలా రొటీన్‌గా ఉంది. 

ఎవరెలా చేశారంటే..
చాలా కాలం తర్వాత తాప్సీ నటించిన తెలుగు సినిమా ఇది. ఓ కొత్త పాత్రతో ఆమె రీఎంట్రీ ఇచ్చింది. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు శైలు పాత్రకు తాప్సీ న్యాయం చేసింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో బాగా నటించింది. ఇక సినిమాకు ప్రధాన బలం రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ నటన అనే చెప్పాలి. రఘుపతి, రాఘవ, రాజారాం అనే కుర్రాళ్ల పాత్రల్లో ఈ ముగ్గురు ఒదిగిపోయారు. తమదైన కామెడీతో నవ్వించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మార్క్‌ కె రాబిన్‌ సంగీతం బాగుంది. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. దీపక్ యెరగరా సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగ్గట్టుగా ప్రతి సీన్‌ చాలా సహజంగా తెరపై చూపించాడు. డైలాగ్స్‌ ఓకే. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. చివరగా.. లాజిక్కులు వెతక్కుండా చూస్తే.. మిషన్‌ ఇంపాజిబుల్‌ అక్కడక్కడా నవ్విస్తుంది.

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2/5)
మరిన్ని వార్తలు