Mission 2020 Review: మిషన్‌ 2020 మూవీ ఎలా ఉందంటే..

29 Oct, 2021 19:51 IST|Sakshi

టైటిల్‌: మిషన్‌ 2020
నటీనటులు: నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, స్వాతి, తదితరులు
నిర్మాతలు: కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు
దర్శకుడు: కరణం బాబ్జి
సంగీత దర్శకుడు: ర్యాప్ రాక్ షకీల్

నవీన్‌చంద్ర కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మిషన్‌ 2020’. కరణం బాబ్జి దర్శకుడు. కుంట్లూర్‌ వెంకటేష్‌ గౌడ్‌, కె.వి.ఎస్‌.ఎస్‌.ఎల్‌.రమేష్‌రాజు నిర్మాతలు. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
విశాఖపట్నానికి చెందిన ప్రకాశ్‌ ఓ తెలివైన ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌. కాలేజీలో అతనే టాపర్‌. ముగ్గురు స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తుంటారు. ఆ నలుగురికి చదువు తప్ప వేరే ధ్యాస ఉండదు. అయితే వారిలో ఒకరు కొత్తగా మొబైల్‌ ఫోన్‌ కొనడంతో.. అశ్లీల వీడియోల మత్తులో పడిపోతారు. చదువును పక్కన పెట్టి పోర్న్‌ వీడియోలు చూస్తుంటారు. . ఆ అశ్లీలతను చూసిన ఉద్రేకంలో అనుకోకుండా తమ స్నేహితురాలు స్వాతి పై వారు అత్యాచారానికి పాల్పడతారు. క్షణికావేశంలో చేసిన ఆ తప్పుతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి. ఈ అత్యాచార కేసును ఏసీపీ జయంత్‌ (నవీన్‌ చంద్ర)ఎలా ఛేదించాడు. చివరకు వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది ?అనేదే మిగతా కథ

ఎలా చేశారంటే..
ఓ సిన్సియర్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ జయంత్‌గా నవీన్‌ చంద్ర అదరగొట్టేశాడు. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాగ బాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అదే విధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన సమీర్, చలాకి చంటి, మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు.

ఎలా ఉందంటే..
మంచి మార్గంలో స్వేచ్ఛగా చైతన్యవంతులుగా ఎదగాల్సిన యువత... అశ్లీల వీడియోల మత్తులో పడి తమ బతుకును ఎలా దుర్భరం చేసుకుంటున్నారనే కోణంలో సందేశాత్మకంగా తెరకెక్కిన సినిమానే మిషన్‌ 2020.  అశ్లీల వీడియోల ప్రభావం కారణంగా తెలిసీ తెలియని వయసులో కొందరు ఎలా తమ జీవితాన్ని వృధా చేసుకుంటారో లాంటి అంశాలను కూడా చాలా ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కరణం బాబ్జీ. తాను ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో మాత్రం కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పాలి. తన సినిమాతో యువతకు ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలన్న దర్శకుడి ఆలోచనను మనం ప్రశంసించాల్సిందే.  ఫస్టాఫ్‌ అంతా స్లోగా సాగుతుంది. ఇంటర్వెల్ కి గాని కథ ముందుకు కదలదు. సెకండాఫ్‌లో కథ కాస్త ఫాస్ట్‌గా, సీరియస్‌గా నడుస్తుంది. క్లైమాక్స్‌లో అత్యాచార బాధితురాలు మీడియాతో మాట్లాడే సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి.. ర్యాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది.  శ్రీ రాపాక స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ వర్క్ వర్కౌట్ కాలేదు. చాలా చోట్ల తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు