థ్యాంక్యూ శ్రీవల్లి.. వేదికపై భావోద్వేగానికి గురైన ఎంఎం కీరవాణి

12 Jan, 2023 10:32 IST|Sakshi

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్‌కు ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందని  సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఈ అవార్డ్ రావడానికి అద్భుతమైన చిత్రబృందమే కారణమని తెలిపారు.  ఈ అవార్డును తన భార్య శ్రీవల్లితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కీరవాణి. 

ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ– 'ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఉద్వేగాన్ని ఇక్కడే కూర్చుని ఉన్న నా వైఫ్‌ (శ్రీవల్లి)తో షేర్‌ చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది. మామూలుగా అవార్డులు అందుకున్నప్పుడు ‘నిజానికి ఇది నాది కాదు.. మరొకరికి దక్కుతుంది’ అని అంటుంటారు. అందుకని ఇలాంటి అవార్డు అందుకున్నప్పుడు నేను అలా మాట్లాడకూడదని ప్లాన్ చేసుకున్నాను. కానీ సారీ...  నేను ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. ఎందుకంటే ఇవి నా హృదయంలోంచి వచ్చే మాటలు.

వరుస క్రమంలో చెప్పాలంటే ముందుగా ఈ అవార్డు నా సోదరుడు, ఈ సినిమా డైరెక్టర్‌ రాజమౌళి విజన్‌కి దక్కుతుంది. నా పనిని నమ్మి, నన్ను సపోర్ట్‌ చేస్తున్నందుకు తనకు ధన్యవాదాలు. తర్వాత ప్రేమ్‌ రక్షిత్‌ గురించి చెప్పాలి. అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. తను లేకపోతే ఈ పాట లేదు. తర్వాత ఈ పాటకు అన్నీ సమకూర్చిన కాలభైరవ, అద్భుతంగా రాసిన రచయిత చంద్రబోస్, కాలభైరవతో కలిసి ఎనర్జిటిక్‌గా పాడిన రాహుల్‌ సిప్లిగంజ్, ఫుల్‌ స్టామినాతో డ్యాన్స్‌ చేసిన ఎన్‌.టి. రామారావు, రామ్‌చరణ్‌లకు ధన్యవాదాలు. చివరిగా.. ఈ పాటకు ప్రోగ్రామ్ చేసిన సాహు సిద్ధార్థ్, జీవన్‌బాబులకు కూడా ధన్యవాదాలు. ఇంకొన్ని వర్డ్స్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే.. థ్యాంక్యూ శ్రీవల్లి... థ్యాంక్యూ వల్లీ’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు కీరవాణి.

మరిన్ని వార్తలు