అమితాబ్‌ ఇంటి ముందు ఎంఎన్‌ఎస్‌ ప్లకార్డుల నిరసన

15 Jul, 2021 19:00 IST|Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ముంబైలోని నివాసం ప్రతీక్ష ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రోడ్డు మధ్యలో ఆయన బంగ్లా ఉందని, ఇంటి గోడను కూల్చివేయాలంటూ బృహత్‌ ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌(బీఎంసీ) గతంలో నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ అమితాబ్‌ దీనిపై స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో అమితాబ్‌ బచ్చన్‌ పెద్ద మనసు చాటుకోవాలని కోరుతూ ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు ప్లకార్డుల ప్రదర్శనకు దిగారు. ‘బిగ్‌బి.. దయచేసి.. పెద్ద మనసు చేసుకోండి’ అంటూ బుధవారం రాత్రి జుహులోని ప్రతీక్ష ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఎంఎన్‌ఎస్‌ నేత మనీష్‌ ధురి మాట్లాడుతూ ‘ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంలో భాగంగా సంత్‌ జ్ఞానేశ్వర్‌ రోడ్డు విస్తరణ కోసం బీఎంసీ 2017లో అమితాబ్‌తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది.

ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్డు విస్తరణ కోసం అందరు సహకరించినా అమితాబ్‌ మాత్రం సహకరించడం లేదు. దీనిపై ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నాము. ఈ మేరకే ఆయన ఇంటి ఎదుట ప్లకార్డుల ప్రదర్శనకు దిగాము’ అని చెప్పుకొచ్చారు.  అంతేగాక ఈ విషయంలో బీఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా, బిగ్‌బి దీనిపై స్పందించకపోయినా బీఎంసీకి వ్యతిరేకంగా భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. అయితే ట్రాఫిక్‌ సమస్యను పరిష్కారించేందుకు రోడ్డు విస్తరణలో భాగంగా అమితాబ్‌ బంగ్లా ప్రతిక్ష గోడను పడగొట్టాలని బీఎంసీ ప్రణాళిక వేసింది. ప్రస్తుతం ఈ రోడ్డు 45 అడుగులు ఉండగా.. దాన్ని 60 అడుగులకు విస్తరించాలని ప్లాన్‌ చేస్తుంది. 

మరిన్ని వార్తలు