రకుల్‌, దీపిక, శ్రద్ధా ఫోన్లు‌ సీజ్‌

27 Sep, 2020 09:10 IST|Sakshi

డ్రగ్స్‌ కేసులు నలుగురు హీరోయిన్ల్‌ ఫోన్స్‌ సీజ్‌ చేసిన ఎన్‌సీబీ

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ యంగ్‌హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య అనంతరం వెలుగుచూసిన డ్రగ్స్‌ వ్యవహారంలో మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్‌సీబీ)  దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రముఖ హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌సింగ్‌, దీపిక పదుకొనె, సారా అలీఖాన్‌, శ్రద్దాకపూర్‌లను విచారించిన అధికారులు మరో కీలక ముందడగు వేశారు. శుక్ర,శనివారాల్లో వీరి విచారణ ముగిసిన అనంతరం నలుగురు నటీమణులు ఫోన్లను సీజ్‌చేశారు. నలుగురు హీరోయిన్లతో పాటు దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌, జయ షాల ఫోన్ల్‌ను సీజ్‌ చేసినట్లు ఎన్‌సీబీ ఆదివారం ఉదయం వెల్లడించింది. శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకుముందు రకుల్‌పై ప్రశ్నల వర్షం కురిపింది. ఇక ఇదే కేసులో శుక్రవారం ధర్మా ప్రొడక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ క్షితిజ్‌ రవి ప్రసాద్‌ను అరెస్టు చేసింది. (ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్‌సీబీ)

మరోవైపు కరిష్మా డ్రగ్స్‌ గురించి జరిపిన వాట్సాప్‌ చాట్‌లో ‘డి’అనే అక్షరం ఆధారం చాటింగ్‌ చేసినట్లు 7 గంటల సుదీర్ఘ విచారణలో వెల్లడైంది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు అనేదానిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరికొన్ని ఆధారాల కోసం వారి మొబైల్‌ ఫోన్స్‌ సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ముగిసిన విచారణలో రకుల్‌పై ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆమె నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. రియాకు రకుల్‌కు మధ్య డ్రగ్స్‌ గురించి వాట్సప్‌లో చాటింగ్‌ జరిగినట్లు, తన నివాసంలో లభ్యమైన డ్రగ్స్‌ కూడా రియాకు చెందినట్లు రకుల్‌ వెల్లడించింది. తాజాగా వీరి మొబైల్‌ ఫోన్స్‌ సీజ్‌ చేయడంతో విచారణ ప్రక్రియలో మరో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు