హెరిటేజ్‌ ఫుడ్స్‌ నాదే.. ఆ సంస్థలో నా షేర్‌ ఎక్కువ!

15 Aug, 2021 08:45 IST|Sakshi

‘మనకి సక్సెస్‌ అయినా, ఫెయిల్యూర్‌ అయినా దేవుడే ఇస్తాడు అనుకుంటే ప్రశాంతంగా ఉంటాం’ అంటున్నారు మోహన్‌బాబు. అది మాత్రమే కాదు.. రాజకీయంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విషయం రాజశేఖర రెడ్డికి చెబితే ఆయన  ఏమన్నారో  కూడా చెప్పారు. ఇంకా తన తాజా చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’, రాజకీయాలు తదితర విషయాల గురించి  స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోహన్‌బాబు చెప్పిన విశేషాల్లోని కొన్ని ఈ విధంగా... 

నేను లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ నుంచి వచ్చినవాణ్ణి. నాన్నగారు ఎలిమెంట్రీ స్కూల్‌ టీచర్‌. భక్తవత్సలం నాయుడు (మోహన్‌బాబు) ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌. జీవితంలో మొట్టమొదట గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి స్కూల్‌ టీచర్‌ అని అబ్దుల్‌ కలాంగారు అన్నారు. నీతి, న్యాయం, ధర్మంగా ఉండాలని టీచర్‌ ఎప్పుడూ బోర్డు పైన రాసేవారు.. అది చిన్నప్పటి నుంచి చూసిన నేను నిజాయితీగా, క్రమశిక్షణగా ఉండటం నేర్చుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చాక గురువు(దాసరి)గారి నుంచి నేర్చుకున్నాను. 7 గంటలకు షూటింగ్‌ అంటే 6.30 గంటలకే సెట్స్‌లో ఉండాలనేవారు. పుట్టుకతోనే అన్నీ రావు.. కొన్ని కొన్ని చూసి నేర్చుకోవాలి. 

గెలిచినప్పుడు ప్రశంసించేవారు, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు విమర్శించే వాళ్లు ఉంటారు. ‘శాంతంగా ఉన్నానని సచ్చు వెధవని అనుకోవద్దు.. గట్టిగా పిండితే గువ్వ అయినా ఎగిరి తంతుంది.. ప్రస్తుతం అదీ నా పరిస్థితి’. సామ్రాజ్యాలే పోయాయి. నా టీమ్, సహచర్యం.. ఆత్మీయులు, మిత్రులు కొందరు పోయారు. పొలిటికల్‌గా అన్నీ చూశాను. కొందరి తరఫున ప్రచారంలోనూ పాల్గొన్నాను. బీజేపీ కోసం వాజ్‌పేయిగారు, నేను ఒకే కారులో ప్రచారానికి వెళ్లాం. అలాగే అద్వానీగారు, నేను ఒకే కారులో వెళ్లాం. అది ఇప్పుడు ఉన్న ఓ ప్రముఖ రాజకీయవేత్తకు తెలుసు. అప్పట్లో నేను తెలుగుదేశంలో ఉన్నాను. కానీ నేను పనికిరానని తీసేశాడు అప్పటి ముఖ్యమంత్రి. ఆ తర్వాత నేను ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీకి 18 శాతం ఓట్లొచ్చాయి.  

అన్న (ఎన్టీఆర్‌)గారు నన్ను రాజ్యసభకి పంపించారు. నేను రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ‘గుడ్‌మార్నింగ్‌ బ్రదర్‌’ అని నేను అంటే, ‘వెరీ గుడ్‌మార్నింగ్‌ బ్రదర్‌.. బాగున్నారా?’ అని వైఎస్‌గారు అనేవారు. బ్రదర్‌ వచ్చి ఆ తర్వాత బావగారు అయ్యారు. ఆయన మా ఇంటికి రెండుసార్లు వచ్చారు.. నేను కూడా వారి ఇంటికి వెళ్లాను. ఆయన్ను చూసినప్పుడు చాలా ఆనందంగా ఉండేది. ఆయన ముఖంలో, ఆ పంచె కట్టులో ఓ రాజసం ఉండే ది. ఎన్టీఆర్‌గారిలా మాట ఇస్తే దానికి కట్టుబడేవారు వైఎస్‌గారు. 

ఆ రోజు అన్నయ్యకోసం పార్టీలోకి వెళ్లాను. ఆ తర్వాత బీజేపీ మంచి పార్టీ.. దేశానికి కావాలని వెళ్లాను. జగన్‌ సీఎం  కావాలని కోరుకుని వెళ్లాను. నేను ఎప్పుడూ ఏదీ ఆశించలేదు.  

ప్రస్తుతం నేను చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చాలా మంచి సినిమా. సెంటిమెంట్, పొలిటికల్, కామెడీ అన్నీ ఉంటాయి. భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఇలాంటి ప్రయోగం ఎవరూ చేయలేదు. ప్రస్తుతం సమాజంలో ఉన్నది ఉన్నట్లు ఈ సినిమాలో చూపించాం. ఎవరు సినిమా తీసినా మాది గొప్పది అంటూ ట్రంప్‌ పెట్టె వాయిస్తుంటారు. కానీ మా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో ప్రతి సీన్‌ అద్భుతంగా ఉంటుంది. ‘డైమండ్‌’ రత్నబాబు మంచి కథ చెప్పాడు. విష్ణుకి చెప్పగానే నచ్చడంతో తనే టైటిల్‌ లోగో డిజైన్‌ చేశాడు. ఈ చిత్రంలో 24 మంది ఆర్టిస్టులున్నారు. ఈ చిత్రానికి నేను స్క్రీన్‌ప్లే మాత్రం అందించానంతే. ఈ తరానికి తెలియని కేఎస్‌ఆర్‌ దాసుగారు అనే దర్శకులు తెరకెక్కించిన ‘నేరస్తుడు’ సినిమాకి స్క్రీన్‌ప్లే అందించాను.. ఆ తర్వాత ఓ రెండు సినిమాలకు, తాజాగా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’కి. నేను డైరెక్టర్స్, రైటర్స్‌ అసోసియేషన్‌లో మెంబర్‌ని. 

డైరెక్షన్‌ చేసే ఆలోచన లేదు. భయం. ఎందుకంటే రోజుకు ఒకర్ని కొట్టాల్సి వస్తుంది (నవ్వుతూ). ఎందుకంటే ఆర్టిస్టు కానీ, టెక్నీషియన్స్‌ కానీ సమయానికి షూటింగ్‌కి రాకపోతే... మనమేమో డబ్బు పెట్టాం. కొడితే షూటింగ్‌ ఆగిపోతుంది. ఫ్లైట్, బస్, ట్రైన్, సినిమా, ఆఫీస్‌.. ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగా వెళతాం. మరి రోజువారి కూలీ తీసుకునే మనం షూటింగ్‌కి ఎందుకు ఆలస్యంగా రావడం. అందుకే నేను డైరెక్షన్‌ చేస్తే ఆ సినిమా పూర్తి అవ్వదు.. లేనిపోని గొడవలు వస్తాయి. అందుకే డైరెక్షన్‌ ప్రస్తుతానికి వద్దనుకున్నాను. కానీ మనసులో మాత్రం ఉంది. ఒక కథ తయారు చేసి పెట్టాం.. ఎప్పుడైనా చేద్దాం అని ఒక ఆశ.. ఎందుకంటే నా జీవితం ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైంది కాబట్టి. 

ఈ జీవితానికి రాజకీయంగా ఓ నమస్కారం పెట్టేద్దామనిపిస్తోంది. గుడి కడితే హిందువులు, మసీదు కడితే ముస్లింలు, చర్చి కడితే క్రైస్తవులు వస్తారు.. అదే బడి కడితే అందరూ వస్తారు.. అక్కడ కులాలు లేవు. అన్ని మతాల వారు నన్ను ఆశీర్వదించబట్టే నటుణ్ణి అయ్యాను కాబట్టి అందరి కోసం విద్యాసంస్థలు నెలకొల్పాను.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరు పేదలకు 25శాతం సీట్లు ఉచితంగా ఇస్తున్నాను.. టాప్‌ బెస్ట్‌ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దానని ఓపెన్‌ ఛాలెంజ్‌ చేసి చెబుతున్నా. 

నేను డ్యాన్సులు, ఫైట్ల మనిషిని కాదు. పూర్తి స్థాయి పెర్ఫార్మర్‌. అయితే నేను పాటలు పాడితే చాలా భయంకరంగా ఉంటుంది. డైలాగులను సరిగమపదనిసల్లా చెప్పగలను.. మ్యూజికల్‌గా డైలాగులు చెప్పగలను. ఇళయరాజాగారు అడిగితే ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రంలో రఘువీర గద్యాన్ని పాటగా చెప్పాను. ‘ఏం బ్రదర్‌.. మీరు ఏం చేసినా అన్ని వర్గాల ప్రజలు ఆదరించారు.. మీరు గొప్ప అదృష్ట జాతకులు’ అని ఓసారి అన్నగారు (ఎన్టీఆర్‌) కూడా అన్నారు. మనకి సక్సెస్‌ అయినా, ఫెయిల్యూర్‌ అయినా దేవుడే ఇస్తాడు అనుకుంటే ప్రశాంతంగా ఉంటాం. 

అప్పట్లో నేను తెలుగుదేశంలో ఉన్నాను. కానీ నేను పనికిరానని అప్పటి ముఖ్యమంత్రి తీసేశాడు. 

రాజకీయంగా నా మనసును గాయపరచింది చంద్రబాబు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ నాదే.. ఆ సంస్థలో నా డబ్బు, నా షేర్‌ ఎక్కువ.. అతనిది తక్కువ. రాజశేఖర రెడ్డిగారు పాదయాత్రకి వెళ్లే ముందు మా ఇంటికి వచ్చారు. నువ్వు, చంద్రబాబు ఫ్రెండ్సే కదా? ఏంటి మీ ఇద్దరికీ గొడవ? అన్నారు వైఎస్‌గారు. వైఎస్‌గారిని అన్నపూర్ణ హోటల్‌లో నాకు పరిచయం చేసింది చంద్రబాబుగారే. హెరిటేజ్‌లో నా డబ్బు ఇంత, చంద్రబాబుది ఇంత, వేరే వ్యక్తిది ఇంత.. ఇలా ఇలా మోసం చేశాడని చెప్పా. ‘వాళ్ల మామకే (ఎన్టీఆర్‌) వెన్నుపోటు పొడిచాడు.. నిన్ను మోసం చేయడంలో కొత్తేముంది?’ అన్నారు వైఎస్‌గారు. 

తల్లితండ్రులు చనిపోగానే మృతదేహాన్ని ఇంట్లో ఉంచొద్దు, బయట పెట్టాలి, వారి దుస్తులు బయట పడేయాలి అంటుంటారు కొందరు. మరి.. వారు సంపాదించిన ఆస్తులు బయట వేయరేం? ఏంటీ మనస్తత్వాలు? దేవుడి గది గురించి ప్రత్యేకంగా ఆలోచించే మనం తల్లితండ్రులు, అత్తమామలకు గదులున్నాయా? అని ఆలోచించం. చాప వేసుకుని హాల్లో పడుకుంటారులే అంటుంటారు. పిల్లల్ని సింహాసనంపై కూర్చొబెట్టిన తల్లితండ్రులకు చాపలేస్తారు, వృద్ధాశ్రమాల్లో చేరుస్తారు. 

కొందరు తల్లితండ్రులు వేరే కులానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న కూతుర్ని కొడతారు.. చంపేందుకు ప్రయత్నిస్తారు. కొడుకు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఏమీ అనరు. కొడుక్కి ఓ న్యాయం? కూతురికి ఓ న్యాయమా? ‘సన్‌ ఆఫ్‌  ఇండియా’ లో ఇలాంటి చాలా విషయాలను ప్రస్తావించాం.

మరిన్ని వార్తలు