Bakasuran Movie: కూతురి కోసం పోరాడే తండ్రి కథ!

18 Feb, 2023 09:03 IST|Sakshi

చిత్రాలను ప్రయోగాత్మకం, ప్రయోజనాత్మకం, ప్రజానందాత్మకం అంటూ మూడు భాగాలుగా విభజిస్తే బకాసురన్‌ చిత్రం ప్రయోజనాత్మకం కేటగిరీలో చేరుతుంది. సమాజానికి అవసరమైన కంటెంట్‌తో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు మోహన్‌.జి. ఇంతకుముందు పళయ వన్నారపేట్టై, ద్రౌపది, రుద్ర తాండవం వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను రూపొందించారు. తాజాగా శ్రీ దర్శకత్వంలో జీఎం ఫిలిం కార్పొరేషన్‌ పతాకంపై నిర్మించిన చిత్రం బకాసురన్‌. దర్శకుడు సెల్వరాఘవన్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో నటరాజన్, కే రాజన్, మన్సూర్‌ అలీఖాన్, నటి తారాక్షి, లావణ్య మాణిక్యం, దేవదర్శిని, పి.ఎల్‌ తేనప్పన్, గుణానిధి, రామ్, శశిలైలా రిచా, కూల్‌ జయంత్, అరుణోదయన్, కుట్టి గోపి ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని, ఫరూక్‌ బాషా చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జీటీఎం సంస్థ శుక్రవారం విడుదల చేసింది.

దర్శకుడు మోహన్‌.జి ఈ చిత్రానికి సమాజంలో జరుగుతున్న ప్రస్తుత విషయాలను ఇతివృత్తంగా తీసుకున్నారు. కొన్ని యధార్థ సంఘటనలను చిత్రంలో వాడుకున్నారు. ముఖ్యంగా విద్యార్థినుల భవిష్యత్తులతో విద్యాసంస్థల అధినేతలు ఎలా ఆడుకుంటున్నారు?, పరిస్థితుల ప్రభావం కారణంగానో, మరి ఇతర కారణాల వల్లో యువతులు వ్యభిచార కూపంలో చిక్కుకుని ఎలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు? అందుకు కొందరు యువకులు ఆధునిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుకుంటున్నారు? వంటి అంశాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన కథ చిత్రం బకాసురన్‌. ఇందులో వీధి భాగోతం కళాకారుడుగా దర్శకుడు సెల్వరాఘవన్‌ నటించారు. మాజీ సైనికుడిగా నటరాజన్, విద్యాసంస్థ అధినేతగా రాధారవి నటించారు. వీరి మధ్య జరిగే కథే బకాసురన్‌. అయితే ఇందులో బకాసురన్‌ ఎవరనేదే చిత్రంలో ఆసక్తికరమైన అంశం. కూతురి తండ్రిగా భీమరాజ్‌ పాత్రలో సెల్వరాఘవన్‌ నటన హైలైట్‌గా ఉంటుంది. ఆయన అలుపెరుగని పోరా టమే బకాసురన్‌ చిత్రం.

మరిన్ని వార్తలు