Most Eligible Bachelor: ఓటీటీ నుంచి మంచి అవకాశాలు వచ్చాయి.. కానీ..

1 Oct, 2021 07:50 IST|Sakshi

‘గీతా ఆర్ట్స్, జీఏ2 బ్యానర్స్‌లో చాలా హిట్‌ సినిమాలు వచ్చాయంటే.. మేం ప్రేక్షకులకు హిట్‌ మూవీస్‌ ఇవ్వలేదు.. వారే మాకు ఇచ్చారు.  సినిమాని ఎంత ప్రేమిస్తారో ఆల్‌ ఇండియాకి తెలుగు ప్రేక్షకులు ఓ పాఠం నేర్పించారు’ అని అల్లు అరవింద్‌ అన్నారు. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో వాసూ వర్మతో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘సినిమాలను విడుదల చేయడానికి ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు దయచేసి ఆ ఇబ్బందుల్ని అర్థం చేసుకుని, వెసులుబాటు కల్పించాలని చిత్ర పరిశ్రమ మాటగా కోరుతున్నాను. మేము ఇండస్ట్రీని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేసేందుకు మీరు సహాయపడాలని కోరుకుంటున్నాను. ఇక సినిమా విషయానికొస్తే.. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ రెండు మూడు కథలు చెబితే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ నచ్చి, సెట్స్‌పైకి వెళ్లిపోవచ్చని చెప్పా. కరోనా వల్ల ఈ సినిమాని రెండున్నరేళ్లుగా తీస్తూ వచ్చాం. ఔట్‌పుట్‌ సంతృప్తి కలిగించింది. అఖిల్‌ ఇప్పటివరకూ చేసిన సినిమాలతో పోలిస్తే మా చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడు’ అన్నారు.

అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ – ‘ఈ సినిమాలో బంధాల మీద ఒక వైవిధ్యమైన యాంగిల్‌ని చూపించారు భాస్కర్‌. ఈ సినిమా నుంచి బంధాలు, బంధుత్వాలు, ప్రేమ.. ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను. అల్లు అరవింద్‌గారు నాకు గాడ్‌ ఫాదర్‌లాంటి వారు. ఈ నెల 15న మీరు నాకు ఒక హిట్‌ ఇవ్వడం కాదు.. నేను కూడా మీకు (అల్లు అరవింద్‌) ఓ హిట్‌ ఇద్దామనుకుంటున్నాను’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ– ‘ఈ చిత్రం చూసి, థియేటర్‌ నుంచి బయటికెళ్లేటప్పుడు ప్రతి భర్త తన భార్య చేతిని పట్టుకుని వెళతాడు.. ఆ మ్యాజిక్‌ ఈ సినిమాకి వర్కవుట్‌ అయింది. అఖిల్‌కి మా బ్యానర్‌ నుంచి వంద శాతం హిట్‌ ఇవ్వాలి. ఇస్తున్నాం ఇచ్చేశామని అనుకుంటున్నాం. మేం నిజాయతీగా సినిమా తీశాం. భాస్కర్‌ బాగా తీశాడు. అల్లు అరవింద్‌గారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉంది. మా సినిమా కోసం ఓటీటీ నుంచి చాలా అవకాశాలొచ్చాయి.. నష్టం లేకుండా లాభంతో బయటపడొచ్చు. ఓ వైపు వడ్డీలు పెరుగుతున్నా కూడా ఇది థియేటర్‌ ఫిల్మ్‌ అని, అక్కడే రిలీజ్‌ చేయాలని అరవింద్‌గారు ఆపారు’ అన్నారు.

వాసూ వర్మ మాట్లాడుతూ– ‘నటన పరంగా అఖిల్‌ క్లాప్స్‌ కొట్టించాడు. పూజా హెగ్డే తొలిసారి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించారనిపిస్తోంది’’ అన్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘కొత్త కథలను ప్రోత్సహించే మంచి హృదయం అరవింద్‌గారిది. అఖిల్‌ పాత్ర కొత్తగా ఉంటుంది. నాకు కనిపించిన కొత్త దారిలో ప్రయాణిస్తూ కథ రాయడంలో ఇబ్బందులు పడ్డాను. ఆ కష్టాల్లో వాసూ వర్మ కూడా నాతో ప్రయాణించారు. అరవింద్‌గారు, బన్నీ వాసు సపోర్ట్‌ లేకపోతే ఈ కథ రాయడం సాధ్యం అయ్యేది కాదు’ అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సత్య గమడి, కెమెరామేన్‌ ప్రదీశ్‌ ఎమ్‌. వర్మ పాల్గొన్నారు.

చదవండి: అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సాంగ్ ప్రోమో విడుదల

మరిన్ని వార్తలు