దీన్ని ప్రేమంటారా? సిగ్గుపడండి: నిర్మాత ఫైర్‌

23 May, 2021 15:31 IST|Sakshi

కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడేవారు ఇంట్లో స్వీయనిర్బంధంలో ఉంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆ మహమ్మారిని జయిస్తున్నారు. ఇదివరకే అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలగానే ఆస్పత్రుల వెంట పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో బెడ్లు దొరక్క, ఆక్సిజన్‌ అందక, సకాలంలో వైద్యం చేయించుకోలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీటన్నింటితో పాటు కరోనా రోగులకు ప్రధానంగా కావాల్సింది మానసిక ధైర్యం. హత్తుకుని మాట్లాడకపోయినా హద్దుల్లో ఉండి వారికి అండగా, తోడుగా నిలిస్తే అదే పదివేలు.

కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి వంటింట్లో కష్టపడుతుంటే అమ్మ ప్రేమ అని డైలాగులు వల్లె వేస్తున్నాడు. ఆమెకు ఆసరాగా ఉండాల్సింది పోయి అద్భుతంగా పని చేస్తున్నావని కీర్తించాడు. 'అనంతమైన ప్రేమనిచ్చేది అమ్మ మాత్రమే. తనెప్పుడూ తన విధిని నిర్వర్తించడం మానదు' అన్న క్యాప్షన్‌తో దీనికి సంబంధించిన ఫొటోను కూడా షేర్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సరిగ్గా ఊపిరాడక ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకున్న తల్లితో వంట చేయిస్తున్నారా? అని మండిపడుతున్నారు.

గ్యాస్‌ స్టవ్‌ దగ్గర్లో ఆక్సిజన్‌ సిలిండర్‌ ఉండటం చాలా ప్రమాదకరం అని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఆ తల్లి ఆక్సిజన్‌ మెషీన్‌ మీద బతుకుతున్నప్పుడు కూడా ఆమె కోసం కుటుంబ సభ్యులెవరూ వంట చేయకపోవడం విషాదకరం అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ పోస్ట్‌ చూసిన తమిళ నిర్మాత నవీన్‌ సైతం దీని మీద విమర్శలు గుప్పించాడు. 'ఇది ప్రేమ కాదు, బానిసత్వం.. ఇలాంటి పని చేయిస్తున్నందుకు సిగ్గుపడండి' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. 

చదవండి: డబ్బులిచ్చి మరీ హెయిర్‌ స్టయిలింగ్‌ చేసేదాన్ని: కాజల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు