చల్‌ చల్‌ గుర్రం... చలాకీ గుర్రం

2 Nov, 2020 02:17 IST|Sakshi

గుర్రం చలాకీదే. గుర్రపు స్వారీ కూడా చలాకీయే. రేసులో చురుకుగా ఉంటే రేసుగుర్రం అవ్వొచు. ఇటీవలే కొందరు కథానాయికలు... గుర్రపు స్వారీ మీద శ్రద్ధ పెట్టారు. ఒకరేమో శరీరాన్ని మరింత ఫిట్‌గా ఉంచుకోవడం కోసం. మరొకరు తన పాత్రను హిట్‌ చేయడం కోసం. ఆ విశేషాలు.

యువరాణి పాత్రకోసం...
ఇటీవల తన కొత్త ఫ్రెండ్‌ బూని సోషల్‌ మీడియా ద్వారా పరిచయం చేశారు త్రిష. బూ అంటే ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న గుర్రం పేరు. త్వరలో చేయబోయే పాత్ర కోసమే ఈ గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు త్రిష. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో నటించనున్నారు త్రిష. ఈ పాత్ర కోసమే ఈ గుర్రపు స్వారీ అని తెలిసింది.
 

మరింత ఫిట్‌గా...
లాక్‌డౌన్‌ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా ఉపయోగిస్తే ప్రణీతా సుభాష్‌ ఫిట్‌నెస్‌ మీద మరింత దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. ‘‘మా ట్రైనర్‌ నేనేదో సినిమాలో పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నానని అనుకున్నారు. కానీ అదేం కాదని చెప్పాను. హార్స్‌ రైడింగ్‌ వల్ల నా ఫిట్‌నెస్‌ మరింత మెరుగుపరుచుకోవచ్చు అనుకున్నాను. అందుకే నేర్చుకుంటున్నానని చెప్పాను. నిజంగానే దీని వల్ల నా శరీరం మరింత చురుకుగా ఉంది. ఇదో సరికొత్త అనుభవం’’ అన్నారు ప్రణీత.

పదును పెడుతున్నారు
బాలీవుడ్‌ హీరోయిన్‌ జాక్వెలిన్‌కు గుర్రపు స్వారీ వచ్చు. గతంలోనే ఆమె ఈ స్వారీ నేర్చుకున్నారు. అయితే తాజాగా తన ప్రతిభకు మరింత పదును పెడుతున్నారు. లాక్‌డౌన్‌లో మళ్లీ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. ‘మన భవిష్యత్తు మన దినచర్యలోనే తెలిసిపోతుంది’ అంటూ ఆ ఫోటోలు షేర్‌ చేశారామె.

మరిన్ని వార్తలు