తారలు నెలల్లో స్లిమ్‌ అయిపోతారు

4 Nov, 2020 00:25 IST|Sakshi
అవికా గోర్‌, విద్యుల్లేఖా రామన్‌, కృతీ సనన్‌

తగ్గడాలు పెరగడాలు సినిమాల్లో సాధారణం. బొద్దుగా కనిపించే తారలు నెలల్లో స్లిమ్‌ అయిపోతారు. కొన్ని సార్లు సినిమాలో పాత్రలు కోసం ఇలా చేస్తారు. కొన్నిసార్లు ఫిట్‌గా ఉండాలని ఫిక్స్‌ అయ్యే తగ్గిపోతారు. లాక్‌డౌన్‌లో కొందరు స్టార్స్‌ ఫిట్‌గా మారిపోయారు. బరువును మొత్తం దించేసుకున్నారు. బరువు తగ్గడంతో కాన్ఫిడెన్స్‌ మరింత పెరిగిందంటున్నారు. ఆ విశేషాలు...

పెరిగి.. తగ్గారు
కృతీ సనన్‌ నాజూకుగానే ఉంటారు. అయితే ‘మిమి’ అనే హిందీ సినిమా కోసం సుమారు 15 కిలోల బరువు పెరిగారీ బ్యూటీ. ఈ సినిమాలో గర్భిణి పాత్రలో నటించారు కృతి. అందుకోసమే 15 కిలోలు పెరిగారామె. సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తగ్గే పని మీద దృష్టి పెట్టారు. లాక్‌డౌన్‌ ఆమెకు కలిసొచ్చింది. ‘‘ఈ లాక్‌డౌన్‌లో బరువునంతా తగ్గించుకోవడం సులువు అయింది. నా ట్రైౖనర్‌ సహాయం వల్లే ఈజీ అయింది’’ అన్నారు కృతీ సనన్‌. 

ఫిట్‌ శింబు
ఆ మధ్య తమిళ హీరో శింబు బరువు బాగా పెరిగారు. లాక్‌డౌన్‌లో పూర్తి శ్రద్ధ బరువు తగ్గడం మీదే పెట్టారు శింబు. లాక్‌డౌన్‌ ముందు వరకూ ఆయన సుమారు 102 కిలోల బరువు ఉన్నారు. ఇప్పుడు 71 కిలోలకు వచ్చేశారు. తగ్గడానికి ఎన్ని నెలలు పట్టిందీ అంటే.. దాదాపు ఏడాది. తగ్గే ప్రయత్నాన్ని గత నవంబర్‌లో మొదలుపెట్టారు. లాక్‌డౌన్‌ వల్ల దొరికిన ఖాళీ సమయంలో కఠోర శ్రమతో వర్కౌట్స్‌ చేశారట. రోజుకి రెండు మూడు గంటలు వ్యాయామానికి కేటాయించారు శింబు. ప్రతిరోజూ వాకింగ్, జిమ్‌తో పాటు టెన్నిస్, బాస్కెట్‌బాల్‌ ఆడుతూ వెయిట్‌లాస్‌ అయ్యారు. ‘‘ఏ పని చేయడానికి అయినా మనం బలంగా సంకల్పించుకోవాలి. మన సంకల్పమే ముఖ్యం’’ అంటారు శింబు. ఇంకో విశేషం ఏంటంటే.. రెండువారాలుగా హీరోయిన్‌ శరణ్యా మోహన్‌ వద్ద భరతనాట్యంలో కోచింగ్‌ తీసుకుంటున్నారాయన. ఓ డ్యాన్స్‌ బేస్డ్‌ సినిమాలో నటించనున్నారట. అందుకే ఈ శిక్షణ అని సమాచారం.

నిజమైన ఆత్మవిశ్వాసం ఇప్పుడొచ్చింది
కామెడీ పాత్రల్లో అందర్నీ ఆకట్టుకున్నారు తమిళ పొన్ను (తమిళ అమ్మాయి) విద్యుల్లేఖా రామన్‌. స్వతహాగా ఆమె బొద్దుగానే ఉంటారు. చేసేవి కూడా కామెడీ ప్రధానంగా సాగే పాత్రలే కాబట్టి తెర మీద మెరుపు తీగలా కనపడాల్సిన పని లేదు. అయితే ఫిట్‌ గా ఉండటం ముఖ్యం అనుకున్నారు. అందుకే బరువు తగ్గడం మీద శ్రద్ధ పెట్టారు. ‘‘ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అనుకున్నాను. కానీ అలా అనుకున్నాను.. అంతే. బరువు తగ్గిన తర్వాతే నిజమైన ఆత్మవిశ్వాసం వచ్చింది. మనసు పెట్టి చేస్తే అసంభవం అంటూ ఏదీ లేదు. అలాగే బరువు తగ్గడం వెనక పెద్ద రహస్యాలేవీ ఉండవు. శ్రద్ధగా శ్రమించడమే’’ అంటారు విద్యుల్లేఖా రామన్‌. దాదాపు పది కిలోలు తగ్గారామె.

శరీరాన్ని గౌరవించాలి
‘‘మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మన శరీరాన్ని గౌరవించాలి. అనారోగ్య సమస్యల వల్ల లావు అవ్వడాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ తిండి విషయంలో కంట్రోల్‌ లేకపోవడం సరైనది కాదు’’ అంటారు ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్‌ అవికా గోర్‌. ‘ఉయ్యాల జంపాల’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అవికా తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో చాలా బరువు పెరిగారామె. లాక్‌డౌన్‌లో శరీరం మీద దృష్టి పెట్టి సుమారు 13 కిలోల వరకూ తగ్గారు. ‘‘ఇష్టమొచ్చింది తినేస్తూ వ్యాయామం చేయకుండా లావయ్యాను. ఓరోజు అద్దంలో నన్ను నేను చూసుకుని నివ్వెరపోయాను. చాలా నిరాశపడ్డాను. నా కాన్ఫిడెన్స్‌ అంతా పోయింది. డ్యాన్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. కానీ బరువు పెరగడంతో సరిగ్గా చేయలేకపోయాను. ఇక లాభం లేదనుకుని మళ్లీ వర్కౌట్స్‌ మొదలుపెట్టాను. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’’ అన్నారు అవికా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు