బాలీవుడ్‌ నయా ఖబర్‌

2 Mar, 2021 02:21 IST|Sakshi

షారుక్‌ ఖాన్‌ తో చేతులు కలిపారు ఆలియా భట్‌. ‘యానిమల్‌’ని ఎప్పుడు వదులుతారో చెప్పారు సందీప్‌. ప్రేమికులు రణ్‌బీర్, ఆలియా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సంగతేంటి? విలన్‌  మళ్లీ వస్తున్నాడు అంటున్నారు
జాన్‌  అబ్రహామ్‌. లాక్‌డౌన్‌  తర్వాత హిందీ పరిశ్రమలో కూడా  షూటింగులు జోరుగా జరుగుతున్నాయి. విడుదల తేదీలు ఫిక్స్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ ‘నయా ఖబర్‌’లు ఏమిటో తెలుసుకుందాం.

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ‘అర్జున్‌  రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘యానిమల్‌’. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు సోమవారం అధికారికంగా వెల్లడించారు సందీప్‌ రెడ్డి. ఇందులో పరిణీతీ చోప్రా హీరోయిన్‌ . బాబీ డియోల్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్, సంజయ్‌దత్‌ కలిసి నటించిన ‘షంషేరా’ చిత్రం ఈ ఏడాది జూన్‌  2021న విడుదల కానుంది. అలాగే రియల్‌ లైఫ్‌ ప్రేమికులు రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం విడుదలకు రెడీ అవుతోంది. మరో వైపు హిందీ హిట్‌ మూవీ ‘పీకే’ సినిమా సీక్వెల్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ నటించనున్నారనే ప్రచారం సాగుతోంది.

ఇక ‘డార్లింగ్స్‌’గా మారిపోయారు బాలీవుడ్‌ స్టార్స్‌ షారుక్‌ ఖాన్‌ – ఆలియా భట్‌. కానీ, ‘డార్లింగ్స్‌’ చిత్రంలో షారుక్, ఆలియా కలిసి నటించడం లేదు. ఈ సినిమాను కలిసి నిర్మిస్తున్నారు. షారుక్‌ ఖాన్‌  నిర్మాణసంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్, ఆలియా భట్‌ కొత్త నిర్మాణ సంస్థ ఎటర్నల్‌ షన్‌షైన్‌  ప్రొడక్షన్స్‌ ‘డార్లింగ్స్‌’ సినిమాను నిర్మించనున్నాయి. నిర్మాతగా ఆలియా భట్‌కు ఇదే తొలి సినిమా కావడం విశేషం. జస్మీత్‌ కెరీర్‌  ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఆలియాభట్, షెఫాలలీ షా, విజయ్‌ వర్మ, రోషన్‌  మాథ్యూ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. రెండు దిగువ మధ్యతరగతి కుటుంబాల మధ్య జరిగే కల్పిత కథనాల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందట.

హీరో జాన్‌  అబ్రహామ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ‘ఎటాక్‌’, ‘సత్యమేవ జయతే 2’, ‘ఏక్‌ విలన్‌  రిటర్న్స్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి రెండు సినిమాల షూటింగ్స్‌ను షురూ చేసిన జాన్‌  తాజాగా ముంబైలో ‘ఏక్‌ విలన్‌  రిటర్న్స్‌’ సినిమా షూట్‌ను స్టార్ట్‌ చేశారు. 2014లో వచ్చిన హిట్‌ మూవీ ‘ఏక్‌ విలన్‌ ’ సినిమాను డైరెక్ట్‌ చేసిన మోహిత్‌ సూరియే ఈ సీక్వెల్‌ను కూడా డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇందులో జాన్‌  అబ్రహామ్‌తో పాటు అర్జున్‌ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 11న విడుదల కానుంది.

ఇక జాన్‌  అబ్రహామ్‌ నటించిన ‘ముంబయ్‌ సాగా’  చిత్రం మార్చి 19న థియేటర్స్‌లోకి రానుంది. స్వరా భాస్కర్, శిఖా తల్సానియా, మెహర్, పూజా చోప్రా ప్రధాన పాత్రధారులుగా హిందీలో ‘జహార్‌  చార్‌ యార్‌’ అనే సినిమా రూపొందనుంది. రచయిత కమల్‌ పాండే ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ మార్చి 5న ప్రారంభం కానుంది.
ఇలా బోలెడన్ని కొత్త కబుర్లతో బాలీవుడ్‌లో సందడి మొదలైంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు