సినిమాను థియేటర్‌లో చూడటం డీఎన్‌ఏలోనే ఉంది

24 Jul, 2020 02:14 IST|Sakshi

‘‘లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు అన్ని వ్యాపారాలు మూతబడ్డాయి. ప్రస్తుతం అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయింది. ఆగస్ట్‌ చివరి వారంలో థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన ప్రారంభం అవుతుందనుకుంటున్నాం’’ అని ప్రముఖ మల్టీప్లెక్స్‌ చైన్ల (పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్‌ వంటి సంస్థలు) సీఈవోలు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే థియేటర్స్‌ ప్రారంభం అయితే ఎలా నడిపించాలనుకుంటున్నారో వంటì  అంశాలను పొందుపరిచి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు, ప్రధానమంత్రి ఆఫీస్‌కి లేఖ రాశారు. అందులోని సారాంశం ఈ విధంగా.


► థియేటర్స్‌కి వచ్చేవాళ్లకు మాస్క్‌ తప్పనిసరి చేస్తాం. లోపలికి వచ్చే ముందు తప్పకుండా ఉష్ణోగ్రత చూసే లోపలికి అనుమతించడం జరుగుతుంది.
► ఇక నుంచి మొత్తం డిజిటల్‌ విధానంలో పనులు జరిగేలా చూస్తాం. పేపర్‌ టికెటింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం. ఎస్‌ఎంఎస్, బార్‌కోడ్‌ స్కానింగ్‌ పద్ధతిని పాటిస్తాం.
► ఒక సీట్‌కి మరో సీట్‌కి మధ్య గ్యాప్‌ ఉండేలా జాగ్రత్తపడతాం.
► మల్టీప్లెక్స్‌లో ఏ రెండు షోలు ఒకేసారి ప్రారంభం కాకుండా చూసుకుంటాం. దానివల్ల అన్ని స్క్రీన్స్‌లో ఇంటర్వెల్‌ ఒకేసారి కాకుండా వేరే వేరే టైమ్‌లో ఉంటుంది. ఇలా అయితే రద్దీ ఏర్పడే అవకాశం తక్కువ.
► ప్రతీ షోకి మధ్యలో కనీసం 15 నిమిషాల నుంచి అర్ధగంట విరామం ఉంటుంది. ఈ సమయంలో మొత్తం సీటింగ్‌ శానిటైజ్‌ చేయడానికి వీలవుతుంది.
► మల్టీప్లెక్స్‌లో వీలైనన్ని శానిటైజర్లు ఏర్పాటు చేస్తాం.

ఇటువంటి విషయాలను ఇందులో ప్రస్తావించారు. ‘‘సినిమా చూడటానికి వచ్చే ప్రతీ ప్రేక్షకుడి భద్రత  విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ప్రేక్షకులకు నమ్మకం కలిగించే వాతావరణం సృష్టించాలనుకుంటున్నాం. అలాగే ఒక్క పెద్ద సినిమా వస్తే మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని సినిమాలు థియేటర్స్‌కి రాకుండానే ఓటీటీలకు వెళ్లిపోయాయి. అదో కొత్త పరిణామం. 

ప్రస్తుతం అందరం కష్ట సమయంలో ఉన్నాం. సినిమా థియేటర్ల వ్యాపారం ఏడాదికి పన్నెండు వేల కోట్లు ఉంటుంది. ప్రస్తుతం థియేటర్స్‌ మూతబడటంతో నెలకు సుమారు వెయ్యి కోట్ల నష్టం ఏర్పడుతోంది. కానీ మళ్లీ అంతా సాధారణ స్థితికి వస్తుంది. ఎందుకంటే సినిమాను థియేటర్లో చూడటం అనేది మన డీఎన్‌ఏలోనే ఉంది. అదో సామూహిక అనుభవం’’ అని పేర్కొన్నారు ఆయా సంస్థల ప్రతినిధులు.

మరిన్ని వార్తలు