Anoop Singh: సూర్య, అల్లు అర్జున్‌తో ఢీకొట్టి.. విలన్‌గా మెప్పించిన అనూప్‌ సింగ్‌ మనోడే

24 Jul, 2022 20:31 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ‘.. ఇఫ్‌ యూ ఆర్‌ ఏ ట్రూ ఇండియన్‌ పోలీస్‌.. నన్ను గెలిచి చంపరా అని సూర్యకు సవాల్‌ విసిరాడు. నేనెవరో తెలుసా.. చల్లా కొడుకుని రా.. అని అల్లు అర్జున్‌తో ఫైట్‌ చేశాడు. అమిగో.. అమిగో అంటూ రోగ్‌ సినిమాలో సైకో పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విలన్‌గా వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనూప్‌సింగ్‌ ఠాకూర్‌ మనోడే. సినీరంగంలో రాణిస్తూ జిల్లాతో ఆత్మీయానుబంధం ఉన్న అనూప్‌పై ఈ వారం సండేస్పెషల్‌.
చదవండి: ఇలా అవుతుందనుకోలేదు, ఆ హీరోయిన్‌తో సినిమా చేయను 

నో.. అన్నచోటే
అనూప్‌ది మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పుడు పైలట్‌ కావాలనుకున్నాడు. శిక్షణ సైతం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే నటుడు కావాలనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది. 129 సార్లు ఆడిషన్స్‌కి వెళ్లినా నో అనే పదమే వినిపించింది. అయినా వెనుకడుగు వేయలేదు. బుల్లి తెరపై వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. వెండితెరపై అరంగేట్రం చేశాడు. ప్రతినాయకుడిగా సత్తా చాటాడు. టాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

సీరియల్‌ నటుడి నుంచి..
అనూప్‌ అరంగేట్రం బుల్లితెర నుంచి మొదలైంది. తొలుత హిందీ దారావాహికలు అయిన మహాభారత్, జై భజరంగబలి, రామాయణం, అక్బర్‌–బీర్బల్, సీఐడీ, చంద్రగుప్త మౌర్య, ఆర్యన్‌లో నటించాడు. మహాభారత్‌ సీరియల్‌లో దృతరాష్రు్టని పాత్ర పోషించాడు. ఇది ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఈ పాత్ర కోసం విపరీతమైన బరువు పెరిగాడు. సినీ ఆఫర్స్‌ రాని పరిస్థితి. ఈ క్రమంలో నిరంతర వ్యాయామంతో కొవ్వును కండరాలుగా మార్చుకున్నాడు. బాడీ బిల్డర్‌గా మారిపోయాడు. 2015లో మిస్టర్‌ ఇండియా, మిస్టర్‌ ఆసియా, మిస్టర్‌ వరల్డ్‌ టైటిళ్లను గెలుచుకున్నాడు. వరల్డ్‌ బాడీబిల్డింగ్‌ ‘ఫిట్‌నెస్‌ ఫిజిక్‌ విభాగం’లో గోల్డ్‌మెడల్‌ సాధించిన తొలిభారతీయుడు కావడం విశేషం.

సినీ ప్రయాణం ఇలా...
బాడీ బిల్డర్‌ తర్వాత అనూప్‌కు సినీ అవకాశాలు వరుస కట్టాయి. తెలుగులో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన రోగ్‌ చిత్రంతో అరంగేట్రం చేశాడు. హీరో సూర్య నటించిన యముడు–3లో విలన్‌గా నటించి మెప్పించాడు. తర్వాత హిందీ చిత్రం కమాండో–2, కన్నడ సినిమా యజమానలో, తెలుగులో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, విన్నర్, ఆచారి అమెరికా యాత్ర, కిలాడీ చిత్రాల్లో నటించాడు. ఆది హీరోగా తెరకెక్కిన తీస్‌మార్‌ఖాన్‌ చిత్రంలోనూ నటించాడు. ఇది ఆగస్టు 19న విడుదల కానుంది. ఇక కన్నడలో ఉద్ఘర్ష, మరాఠీలో బేబాన్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా నటిస్తున్న హిందీ సినిమా కంట్రోల్‌లో పోలీస్‌ ఆఫీసర్‌గా కీలక పాత్రలో నటిస్తున్నాడు. గతంలో ఆయన నటించిన యముడు–3 హిందీ రీమేక్‌లో ప్రస్తుతం హీరోగా అవకాశం దక్కింది. ప్రస్తుతం షూటింగ్‌ కొనసాగుతోంది.

ఆదిలాబాద్‌ టౌన్‌ నుంచి బీటౌన్‌ దాకా..
అనూప్‌సింగ్‌ ఠాకూర్‌ మల్టీ టాలెంటెడ్‌. నేపథ్య గాయకుడు, మోడల్, అథ్లెట్‌. అమెరికాలో పైలట్‌గా శిక్షణ సైతం పొందాడు. 17 ఏళ్ల నుంచే మోడలింగ్‌ చేశాడు. కండల వీరుడు కూడా. తండ్రి ఇంద్రజిత్‌ సింగ్‌ ఠాకూర్‌ది ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి. ఇంద్రజిత్‌ వివాహం పూనమ్‌ దేవిసింగ్‌తో ఇక్కడే జరిగింది. అనంతరం వీరి కుటుంబం ముంబైకి షిఫ్ట్‌ అయ్యారు. ప్రస్తుతం అక్కడి హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు ఇంద్రజిత్‌. అనూప్‌ సోదరులు, వారి చిన్నాన్న, పెద్ద నాన్నలు ఇక్కడే ఉండడంతో ఏ శుభకార్యం జరిగినా తరచూ ఇక్కడికి వస్తుంటారని కుటుంబ సభ్యులు ఆనందంతో చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు