‘నాన్నకు ప్రేమతో.... ’అంటున్న స్టార్‌ హీరోలు

24 Feb, 2023 02:26 IST|Sakshi

తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.  ఎన్ని వచ్చినా ఈ ‘అనుబంధం’ ఎవర్‌ గ్రీన్‌. అందుకే ఈ రిలేషన్‌ చుట్టూ కొత్త కథలు అల్లుకుని సినిమాలు తీస్తుంటారు.  ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఈ అనుబంధం నేపథ్యంలో కొన్ని సినిమాలు రానున్నాయి. ఆ విశేషాలు  తెలుసుకుందాం. 

కమల్‌హాసన్‌ తండ్రీకొడుకుగా రెండు పాత్రలు  చేసిన ఓ చిత్రం ‘ఇండియన్‌’ (భారతీయుడు). 1996లో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి, అతని తనయుడు, ప్రభుత్వ ఉద్యోగి చంద్రబోస్‌ సేనాపతి పాత్రల్లో కమల్‌హాసన్‌ ద్విపాత్రాభినయం చేశారు. దేశభక్తుడైన సేనాపతి లంచగొండి అయిన తన తనయుడు చంద్రబోస్‌ను హత్య చేయడం ఈ సినిమాకే ప్రధాన హైలైట్‌.

భారీ ఎత్తున ప్రేక్షకాదరణ పొందిన ఈ ‘ఇండియన్‌’ సినిమాకు సీక్వెల్‌గా పాతికేళ్ల తర్వాత కమల్‌హాసన్, శంకర్‌ ‘ఇండియన్‌ 2’ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రధానంగా తండ్రీకొడుకుల నేపథ్యంలోనే సాగుతుందని తెలిసింది. ఇండియన్‌ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్‌ 2’లో కూడా కమల్‌హాసన్‌ తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. కథలోని కీలక సన్నివేశాలు 1920 నేపథ్యంలో ఉంటాయని తెలిసింది.

అంటే కథ.. స్వాతంత్య్రానికి పూర్వం సేనాపతి, అతని తండ్రికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఉంటుందన్నట్లుగా ఈ  చిత్రరచయితల్లో ఒకరైన జయ మోహన్‌ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ  చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. 

 ప్రభాస్‌ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘సలార్‌’ ఒకటి. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు లుక్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ చిత్రంలో ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారని వినికిడి. అలాగే ఈ సినిమా  కథకు తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ను జోడించారట ప్రశాంత్‌ నీల్‌. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తండ్రి బాధ్యతను కొనసాగించి, సక్సెస్‌ అయ్యే కొడుకు పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తారన్నది ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ చిత్రం సెప్టెంబరు 28న రిలీజ్‌ కానుంది.

దర్శకుడు శంకర్, హీరో రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కథాంశం తండ్రీతనయుల అనుబంధమేనట. ఈ రెండు పాత్రలనూ చరణే చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఓ వ్యక్తి శ్రమిస్తాడు. కానీ కొందరు స్వార్థపరుల కారణంగా అతనికి అన్యాయం జరుగుతుంది. ఆ తర్వాతి కాలంలో ఆ వ్యక్తి తనయుడు ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవుతాడు. తండ్రిని ఇబ్బంది పెట్టినవారిని శిక్షిస్తూనే, డబ్బు, స్వార్థం లేని రాజకీయాల కోసం ప్రజలు ఎలా చైతన్యవంతులై ఉండాలి? ఐఏఎస్‌ ఆఫీసర్లు ఏ విధంగా విధులు నిర్వర్తించాలి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్‌. సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

►  సుధీర్‌బాబు ప్రస్తుతం ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమా చేస్తున్నారు.  హర్షవర్థన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రధానంగా తండ్రీకొడుకుల ఎమోషన్‌ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో మూడు డిఫరెంట్స్‌ లుక్స్‌లో సుధీర్‌బాబు కనిపిస్తారని టాక్‌. 

►  తండ్రీకొడుకుల ఎమోషన్‌ నేపథ్యంలో సాగే చిత్రాలు బాలీవుడ్‌లోనూ కొన్ని ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘యానిమల్‌’. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తండ్రి కోసం గ్యాంగ్‌స్టర్‌గా మారే ఓ యువకుడి కథే ‘యానిమల్‌’ అని బాలీవుడ్‌ టాక్‌. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రిగా అనిల్‌కపూర్‌ కనిపిస్తారని సమాచారం.

మరిన్ని వార్తలు