డ్రగ్స్‌ కేసు: ఎంపీ మిమి చక్రవర్తి సెటైర్లు!

24 Sep, 2020 21:10 IST|Sakshi

కోల్‌కతా: బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్‌ వ్యవహారంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, నటి మిమి చక్రవర్తి స్పందించారు. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలు మాత్రమే మత్తుకు బానిసలై మాదకద్రవ్యాల కోసం పరితపించిపోతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డ్రగ్స్‌ కేసులో ఇంతవరకు కేవలం నటీమణులకు మాత్రమే సమన్లు జారీ అయిన నేపథ్యంలో తనదైన శైలిలో ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు.. ‘‘అవును.. పితృస్వామ్యమా.. బాలీవుడ్‌లో ఉన్న మహిళలు హష్‌, డ్రగ్స్‌ సహా ఇంకేం కావాలనుకున్నా దాన్ని దక్కించుకుంటారు. అయితే అక్కడున్న పురుషులు మాత్రం వంటపని, ఇంటిపనిలో నిమగ్నమై, తమ భార్యలు బాగుండాలంటూ ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు కళ్ల నిండా నీళ్లు నింపుకొని.. ‘‘దేవుడా తనను కాపాడు’’ అంటూ  చేతులెత్తి మొక్కుతూ ఉంటారు’’అని మిమి చక్రవర్తి చురకలు అంటించారు. (చదవండి: డ్రగ్స్‌ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!)

కాగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతితో బయటపడ్డ మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటికే అతడి ప్రేయసి రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనేతో పాటు శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సమన్లు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఇంతవరకు ఒక్క నటుడి పేరు కూడా ఇంతవరకు బయటకు రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మిమి చక్రవర్తి ఈ మేరకు స్పందించారు. ఇక తనను వేధించిన ఓ క్యాబ్‌ డ్రైవర్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. కాగా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మిమి టీఎంసీలో చేరి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. జాదవ్‌పూర్‌ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. (చదవండి: మిమి చక్రవర్తితో ట్యాక్సీ డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన)

మరిన్ని వార్తలు