మిస్టర్‌... టార్గెట్‌ మిస్‌!

30 Jan, 2021 01:08 IST|Sakshi

రివ్యూ టైమ్‌

చిత్రం: ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’
తారాగణం: జ్ఞానేశ్వరి కాండ్రేగుల, శైలేష్‌ సన్నీ
స్క్రీన్‌ప్లే, డైలాగులు: సుధీర్‌ వర్మ పేరిచర్ల
కథ, తొలి విడత స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్‌ రెడ్డి

జనం దగ్గర నుంచి డబ్బులు పోగు చేసి, వాళ్ళను భాగస్వాముల్ని చేసి క్రౌడ్‌ ఫండింగ్‌ పద్ధతిలో సినిమాలు తీయడం కొద్దికాలంగా ఊపందుకుంటోంది. ఆ పద్ధతిలో వచ్చిన తాజా చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’. పూర్తిగా కొత్తవాళ్ళతోనే తీసిన ఈ చిత్రం సమకాలీన సమాజంలో చాలామంది యువతీ యువకులు చేసే ఓ తప్పును ఎత్తి చూపేందుకు ప్రయత్నించింది. కాన్సెప్ట్‌ బాగున్నా... కథనం బాగుంటేనే ఏ సినిమాకైనా మార్కులు పడతాయి. కానీ, ఈ చిత్రం ఆ పాయింట్‌ను ఎక్కడో మిస్సయినట్టుంది.

కథేమిటంటే..: శశికళ అలియాస్‌ శశి (జ్ఞానేశ్వరి) ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. ముంబయ్‌లో ఉద్యోగం చేస్తూ, ప్రేమికుడున్న హైదరాబాద్‌కు వచ్చేయాలని ప్రయత్నిస్తుంటుంది. తీరా హైదరాబాద్‌కు వచ్చిన హీరోయిన్‌కు ఒకరికి ఇద్దరితో ఎఫైర్లున్న తన లవర్‌ నిజస్వరూపం ఓ పబ్‌లో బయటపడుతుంది. అతనికి బుద్ధి చెప్పే క్రమంలో యాదృచ్ఛికంగా అమలాపురం అబ్బాయి శివ (శైలేష్‌ సన్నీ)కి దగ్గరవుతుంది. వారిద్దరూ సహజీవనమూ సాగిస్తుంటారు. ఉద్యోగం పోయిన శివలో వచ్చిన మార్పుతో హీరోయిన్‌ బ్రేకప్‌కు సిద్ధమవుతుంది. తీరా బ్రేకప్‌ అయ్యే టైములో వారిద్దరి ముద్దుముచ్చట్ల ప్రేమాయణం తాలూకు ప్రైవేట్‌ సెల్ఫీ వీడియో ఉన్న హీరో ఐఫోన్‌ పోతుంది. ఆ ఆంతరంగిక అసభ్య వీడియో నెట్‌లోకి ఎక్కుతుందనే భయంతో ఆ ఫోన్‌ కోసం ఇద్దరూ కలసి అన్వేషణ సాగిస్తారు. తరువాత ఏమైంది, ఫోన్‌ దొరికిందా, వారి ప్రేమ బ్రేకప్‌ పర్యవసానం ఏమిటన్నది సెకండాఫ్‌లో సుదీర్ఘంగా సా...గే కథ.

ఎలా చేశారంటే..: ఈ చిత్రంలో అందరి కన్నా ఎక్కువ పేరొచ్చేది – హీరోయిన్‌ గా తెరంగేట్రం చేసిన జ్ఞానేశ్వరి కాండ్రేగులకే! మోడలింగ్‌ నుంచి టీవీ షో ‘పెళ్ళిచూపులు’లో ఫైనల్స్‌ దాకా ఎదిగిన ఈ విశాఖ అమ్మాయి ఓ సర్‌ ప్రైజింగ్‌ ఫైండ్‌. ఆ మధ్య ‘క్రాక్‌’లో బి.బి.సి. విలేఖరిగా కనిపించిన జ్ఞానేశ్వరి ఈ తొలి చిత్రంలోని హాట్‌ సీన్లను బోల్డ్‌గా చేశారు. ఫోటోజెనిక్‌ స్కీన్ర్‌ ప్రెజెన్స్‌తో కొత్తమ్మాయిలా కాక తెరపై ఆత్మవిశ్వాసంతో, అనుభవజ్ఞురాలిలా అనిపిస్తారు. హీరోగా తెరంగేట్రం చేసిన జెమినీ టీవీ యాంకర్‌ శైలేష్‌ సన్నీ అక్కడక్కడా మెరుస్తారు. మిగిలినవారిలో బుల్లెబ్బాయ్‌ పాత్రధారి టైమింగ్, సహజ నటన ఆకట్టుకుంటాయి.  

ఎలా తీశారంటే..: దర్శకుడు అశోక్‌ రెడ్డికి గతంలో ‘ఓ స్త్రీ రేపు రా’ చిత్రం తీసిన అనుభవం ఉంది. 2019లో సైమా అవార్డుల్లో బహుమతి గెల్చిన షార్ట్‌ ఫిల్మ్‌ తాలూకు కాన్సెప్ట్‌నే ఈ 125 నిమిషాల సినిమాగా తీశారాయన. కానీ, షార్ట్‌ ఫిల్మ్‌ కథను ఫీచర్‌ ఫిల్మ్‌ నిడివికి తేవాలంటే కేవలం సాఫ్ట్‌ పోర్న్‌ సినిమాలా మిగలకూడదు కదా! బలమైన సీన్లు, బిగువైన కథనం కావాలి కదా! ఆ పాయింట్‌ను ఆయన ఎలా మరిచిపోయారో అర్థం కాదు.  

ప్రేమలో ఒకసారి దెబ్బతిన్న హీరోయిన్‌ ఈసారి జాగ్రత్తగా ఉండదలుచుకున్నానంటూనే హీరోను చటుక్కున ప్రేమించడంలో అర్థం లేదు. వారి ప్రేమకు పునాది లైంగిక ఆనందమే తప్ప, మరేదీ ఉన్నట్టూ కనిపించదు. అలాగే, పబ్‌లో ఫస్ట్‌ లవర్‌ తాలూకు నిజస్వరూపాన్ని హీరోయిన్‌ తెలుసుకొనే సందర్భంలోనూ ఆ రెండు పాత్రల ప్రవర్తన వాస్తవానికి దూరంగా ఉంటుంది. మిస్సయిన ఫోన్‌ను కనిపెట్టడానికి ఐఫోన్‌లో బోలెడన్ని ఫీచర్లుండగా, లాజిక్‌ లేని జి.పి.ఎస్‌. ట్రాకింగ్‌ మీద దర్శక, రచయిత ఆధారపడడం విడ్డూరం. దొరకని ఫోన్‌ కోసం వెతుకులాటలో సాగదీసిన సీన్లు చూస్తే, హాలులో మనం దొరికిపోయిన ఫీలింగూ వస్తుంది.

సినిమాలో అక్కడక్కడా డైలాగ్స్‌ మెరుస్తాయి. హాలులో నవ్వులు విరుస్తాయి. సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్ల మానసిక సంఘర్షణ దగ్గరకు వచ్చేసరికి డైలాగులతో క్లాసు పీకుతున్న భావన కలిగితే తప్పుపట్టలేం. పాటలు ఒకటీ, అరా బాగున్నా, ప్రతిసారీ నేపథ్యంలో ఒక బిట్‌ సాంగ్‌ రావడం మితిమీరింది. గ్రీన్‌ మ్యాట్‌లో తీసిన షాట్లు తెలిసిపోతుంటాయి. తీసుకున్న పాయింట్‌ బాగున్నా, టైటిల్స్‌ దగ్గర నుంచి ఫస్టాఫ్‌ అంతా లిప్‌లాక్‌లు, హాట్‌ సీన్ల మీదే అతిగా ఆధారపడ్డారు. ఉన్నంతలో ఫస్టాఫ్‌లోనే ఫ్లాష్‌ బ్యాక్‌ కథ, కథనం ఫరవాలేదనిపిస్తాయి. తీరా సెకండాఫ్‌కు వచ్చేసరికి అవి రెండూ పూర్తిగా చతికిలపడ్డాయి. అసలే అందరూ కొత్తవారున్న ఈ సినిమాకు అది మరీ బలహీనతగా మారింది. హీరోయిన్‌ చూడడానికి బాగున్నా, కాన్ఫిడెంట్‌గా పాత్ర పోషణ చేసినా, ఎన్ని బోల్డ్‌ సీన్లున్నా – చివరకు ప్రేక్షకులకు మాత్రం తీరని అసంతృప్తే మిగులుతుంది.

బలాలు:
యూత్‌ను ఆకర్షించే సీన్లు
హీరోయిన్‌ అభినయం
ఫస్టాఫ్‌

బలహీనతలు:
అందరూ కొత్తవాళ్ళే కావడం
గాడి తప్పిన సెకండాఫ్‌
బోరెత్తించే హీరో ఫ్రస్ట్రేషన్‌ డైలాగులు
మిస్స యిన లాజిక్‌లు
అతిగా వచ్చే  సాంగ్స్‌

కొసమెరుపు:
చూడకున్నా... ఏమీ మిస్‌ కారు!

రివ్యూ: రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు