రీరిలీజ్‌ చిత్రాలపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు

19 Aug, 2023 16:25 IST|Sakshi

రీరిలీజ్‌ వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయి

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా సాగుతోంది. స్టార్‌ హీరోల పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తూ క్యాష్‌ చేసుకుంటున్నారు కొంతమంది నిర్మాతలు. అభిమానులు తమ హీరోల ఓల్డ్‌ మూవీస్‌ని థియేటర్లలో మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని సినిమాలు అయితే ఊహించని రీతిలో కలెక్షన్స్‌ రాబట్టాయి. అయితే ఈ రీరిలీజ్‌ చిత్రాలు బడా నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తుంటే.. చిన్న నిర్మాతలకు మాత్రం భారీ నష్టాన్ని మిగులుస్తోంది. పెద్ద సినిమాలు పోటీలో లేని డేట్‌ చూసుకొని చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. అదే రోజు రీరిలీజ్‌ పేరుతో బడా చిత్రాలను రావడం తమకు ఇబ్బందిగా మారిందని చిన్న నిర్మాతలు వాపోతున్నారు.

(చదవండి: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్‌లో ఉందా?)

తాజాగా ఇదే విషయంపై ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌లో నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. చిన్న సినిమాల విడుదల రోజు పెద్ద సినిమాలను రీరిలీజ్‌ చేయడం ఆపాలని డిమాండ్‌ చేశాడు. శుక్రవారం కాకుండా సోమ, మంగళ వారాల్లో రీరిలీజ్‌ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

(చదవండి: రాజమౌళిపై రేణు దేశాయ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?)

‘చిన్న సినిమాకి వీకెండ్‌ స్కోప్‌ దొరకడమే చాలా కష్టం. అలాంటి స్కోప్‌లో మళ్లీ రీరిలీజ్‌లు అని పాత సినిమాలు విడుదల చేయడం మాలాంటి చిన్న నిర్మాతలకు ఇబ్బంది కలిగిస్తోంది. అలా అని రీరిలీజ్‌ చిత్రాలను నేను వ్యతిరేకం కాదు. కానీ చిన్న చిత్రాలు విడుదలయ్యే రోజు పెద్ద చిత్రాలను రీరిలీజ్‌ చేయొద్దని నా విజ్ఞప్తి. శుక్రవారం కాకుండా సోమ, మంగళవారాల్లో రీరిలీజ్‌ చేస్తే బాగుంటుంది. ఇదే విషయంపై త్వరలో ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో కూడా ఫిర్యాదు చేస్తా’అని అన్నారు. కాగా, ఆగస్ట్‌ 18న మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ చిత్రంతో పాటు మరో రెండు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అదే రోజు ప్రభాస్‌ యోగితో పాటు ధనుష్‌ ‘రఘువరన్‌ బీటెక్‌’కూడా థియేటర్స్‌లో మళ్లీ విడుదలైంది.  

మరిన్ని వార్తలు