అమ్మాడి.. నాకో పెద్ద సవాల్‌!: మృణాల్‌ ఠాకూర్‌

5 Dec, 2023 00:02 IST|Sakshi

‘‘హాయ్‌ నాన్న’ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. భావోద్వేగాలూ ఉంటాయి. దర్శకుడు శౌర్యువ్‌కి ఇది తొలి సినిమా అయినా ఎక్కడా కొత్త దర్శకుడితో పని చేస్తున్నామనే ఫీలింగ్‌ రాలేదు. తన విజన్, అప్రోచ్‌ చాలా క్లారిటీగా ఉన్నాయి. శౌర్యువ్‌ సృష్టించిన మ్యాజిక్‌ని ఈ గురువారం ప్రేక్షకులు చూస్తారు’’ అని హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ అన్నారు.

శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా శ్రుతీహాసన్, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా మృణాల్‌ ఠాకూర్‌ పంచుకున్న విశేషాలు. 

► ‘సీతారామం’ సినిమా తర్వాత నన్ను మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో చూడాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు. వారిని అలరించేందుకు నా మనసుకు దగ్గరైన పాత్రలు, సినిమాలు చేయడంపై దృష్టి పెట్టాను. ‘సీతారామం’ హిట్‌ తర్వాత నేను చేసిన ‘హాయ్‌ నాన్న’పై అంచనాలుంటాయి. వాటికి తగ్గట్టు చాలా అద్భుతమైన కథ ఇది. ఇందులో నేను యష్ణ, నానీగారు విరాజ్‌ పాత్రల్లో నటించాం. తెరపై విరాజ్, యష్ణ ప్రయాణాన్ని చూసిన ప్రేక్షకులు తప్పకుండా వారితో ప్రేమలో పడిపోతారు.

► కథని, పాత్రలని బలంగా నమ్మి యూనిట్‌ అంతా నిజాయితీతో చేసిన సినిమా ఇది. ఇందులో నా పాత్ర న్యూ ఏజ్‌ అమ్మాయిగా ఉంటుంది. ఈ మూవీలోని మానవీయ బంధాలు, భావోద్వేగాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. ఈ సినిమాలో పాట పాడటం సవాల్‌గా అనిపించింది. ఇందులో ‘అమ్మాడి..’ పాటలో ప్రతి పదాన్ని ట్యూన్‌కి తగ్గట్టు లిప్‌ సింక్‌ చేయాలి. అది నాకు చాలా సవాల్‌గా అనిపించింది. ఈ పాటకి అనంత శ్రీరామ్‌గారు మంచి సాహిత్యం అందించారు.

► నానీగారు చాలా సపోర్టివ్‌. షూటింగ్‌లో నాకు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. మోహన్, విజయేందర్‌ రెడ్డి గార్లు ప్యాషనేట్‌ ప్రోడ్యూసర్స్‌. రాజీపడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు. ఈ మూవీలో రాక్‌ స్టార్‌ ఎవరంటే బేబీ కియారానే. తన పాత్ర ప్రేక్షకుల మనసుని హత్తుకుంటుంది. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు సంగీతాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తారు.

► మా నాన్న నా బిగ్గెస్ట్‌ ఇన్‌స్పిరేషన్‌. ఈ రోజు నేనీ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనే. ఎన్ని సమస్యలున్నా హాయిగా నవ్వుతూ జీవితాన్ని గడపాలని నేర్పించారు. మంచి విషయాలు జరగడానికి సమయం పడుతుందని, జీవితంలో ఓర్పుతో ఉండాలని చెబుతుంటారు. నాన్నే నా జీవితానికి మూలస్తంభం. ఇండస్ట్రీలో నేను ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి. ఇంకా మంచి మంచి సినిమాలు, పాత్రలు చేయాలి.

► ప్రేక్షకులకు నా పేరు గుర్తు ఉండకపోయినా పర్లేదు కానీ, సీత.. యష్ణ..  ఇలా చేసిన పాత్రలతో నేను గుర్తుండిపోవాలి. దాని కోసం నిజాయితీగా కష్టపడి పని చేస్తాను. ప్రస్తుతం తెలుగులో ‘ఫ్యామిలీ స్టార్‌’, హిందీలో పలు సినిమాల్లో నటిస్తున్నాను. 

>
మరిన్ని వార్తలు