ఒక్కోసారి గ్యాప్‌ సహజం

13 Dec, 2020 00:26 IST|Sakshi

‘‘సినిమా ఇండస్ట్రీలో నా కెరీర్‌ స్టార్ట్‌ అయి 30ఏళ్లు నిండాయి. 1990 జనవరి 2న నా తొలి సినిమా ‘శత్రువు’ విడుదలైంది. వ్యాపారాల్లో, రాజకీయాల్లో, సినిమాల్లో.. ఇలా ఆయా రంగంలోనివారి జీవితాల్లో ఎత్తు పల్లాలు ఉన్నట్లే నా జీవితంలోనూ ఉన్నాయి. అందుకు భయపడి ప్రయత్నం ఆపకూడదు’’ అని దర్శక–నిర్మాత ఎం.ఎస్‌. రాజు అన్నారు. శ్రవణ్‌ రెడ్డి హీరోగా, సిమ్రత్‌ కౌర్, రుహానీ శర్మ హీరోయిన్లుగా ఎం.ఎస్‌. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్‌ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్‌ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమా ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ ఫ్రైడే మూవీస్‌ ద్వారా ఈ నెల 18న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భం గా ఎం.ఎస్‌. రాజు చెప్పిన విశేషాలు.

►‘మస్కా’ తర్వాత నిర్మాతగా, ‘ తూనీగ తూనీగ’ తర్వాత దర్శకునిగా గ్యాప్‌ వచ్చింది. ఒక్కోసారి గ్యాప్‌ రావడం సహజం. ‘హిట్లర్‌’ సినిమాకి ముందు చిరంజీవిగారికి కూడా ఏడాది గ్యాప్‌ వచ్చింది. ‘తూనీగ తూనీగ’ ఫ్లాప్‌ కావడంతో నిర్మాణమా? దర్శకత్వమా? అనే డైలమాలో ఉండిపోయాను. ఆ తర్వాత అడల్ట్‌ కంటెంట్‌తో ‘డర్టీ హరి’ కథ రాసుకున్నాను. మా సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌లో అన్ని జానర్‌ సినిమాలు తీశాను. ట్రెండ్‌కి తగ్గట్టు మారాలని అడల్ట్‌ కంటెంట్‌తో ‘డర్టీ హరి’ తీశా. ఈ సినిమాని నా కుటుంబ సభ్యులు చూసి, బాగుందన్నారు. ప్రేక్షకులు కూడా బాగుందంటారు. కుటుంబమంతా కలసి చూడదగ్గ చిత్రమిది.

►‘డర్టీ హరి’ని థియేటర్స్‌లో రిలీజ్‌ చేద్దామనుకున్నాం. కానీ, సినిమా చూసిన నిర్మాత ‘బన్నీ’ వాస్‌ చాలా బాగుంది, మా ‘ఫ్రైడే మూవీస్‌’ ఏటీటీలో రిలీజ్‌ చేద్దామన్నారు. ప్యాన్‌ ఇండియా కథతో రూపొందిన చిత్రం కాబట్టి ఇతర భాషల్లోనూ అనువదించి, రిలీజ్‌ చేస్తాం.

మరిన్ని వార్తలు