ఓపెన్‌ సెసేమ్‌...

2 Dec, 2020 02:21 IST|Sakshi

4వ తేదీ నుంచి తెలంగాణలో మల్టీప్లెక్సులు షురూ

ఎనిమిదిన్నర నెలల పైగా విరామం... వేలాది సినీ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణ... లక్షలాది సినీ ప్రియుల ఆకాంక్ష... ఎట్టకేలకు ఫలిస్తోంది. తెలుగు నేలపై మరో రెండురోజుల్లో... తెలంగాణలో సినిమా హాళ్ళు తెరిచేందుకు మల్టీప్లెక్స్‌ యజమానులు సిద్ధమవుతున్నారు. క్రిస్టఫర్‌ నోలన్‌ రూపొందించిన లేటెస్ట్‌ హాలీవుడ్‌ చిత్రం ‘టెనెట్‌’ లాంటి వాటితో ఈ శుక్రవారం నుంచి మళ్లీ గల్లాపెట్టెలు గలగలలాడాలని ఆశిస్తున్నారు. 

తెలుగు సినీవ్యాపారంలో సింహభాగమైన నైజామ్‌ ఏరియాలో, అందులోనూ అతి కీలకమైన హైదరాబాద్‌లో హీరో మహేశ్‌ బాబు – ఏషియన్‌ ఫిల్మ్స్‌ నారంగ్‌ కుటుంబానికి చెందిన అధునాతన మల్టీప్లెక్స్‌ ‘ఏ.ఎం.బి. సినిమాస్‌’ ఈ 4వ తేదీ నుంచి ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళ, హిందీల్లో వస్తున్న ‘టెనెట్‌’తో మళ్లీ ఓపెన్‌ అవుతోంది. కొత్త తెలుగు సినిమాలేవీ లేకపోవడంతో ప్రస్తుతానికి పాత ఇంగ్లీషు, హిందీ, ప్రాంతీయ భాషా చిత్రాలను ప్రదర్శించనుంది. అయితే, లిమిటెడ్‌ షోలు మాత్రమే వేయనున్నట్లు ‘ఏ.ఎం.బి’ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే, ఐనాక్స్, పి.వి.ఆర్, సినీప్లెక్స్‌ లాంటి ఇతర మల్టీప్లెక్సులు సైతం పరిమిత షోలతో తమ హాళ్ళు తెరిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ ప్రయత్నం సఫలమై, జనం నెమ్మదిగా థియేటర్ల దారి పడితే గనక, మార్చి నెల మధ్య నుంచి తెలుగు నేలపై మూసి ఉన్న సినిమా హాళ్ళు నిదానంగా అయినా కళకళలాడతాయి.

ఆల్‌ రెడీ... ఆంధ్రాలో...
నిజానికి ఉత్తరాదిన ముంబయ్‌ లాంటి ప్రాంతాలలోనూ, కర్ణాటక, తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ళు పరిమితంగానైనా ఇప్పటికే తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ అన్‌ లాక్‌ డౌన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్టోబర్‌ మధ్య నుంచే సినిమా ప్రదర్శనలకు అనుమతించింది. మొదట తటపటాయించినా, ఆపైన ఎగ్జిబిటర్లు దసరా, దీపావళి టైమ్‌కి ధైర్యం చేశారు. పూర్తిస్థాయిలో కాకపోయినా, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలతో పాటు గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట లాంటి కేంద్రాలలో ఇప్పటికే కొన్ని నాన్‌ ఏ.సి. హాళ్ళు తెరుచుకున్నాయి. హాళ్ళలో సగం సీటింగ్‌ కెపాసిటీకే ప్రభుత్వం అనుమతించింది. మరోవైపు పెరిగిన శానిటైజేషన్‌ ఖర్చులు, కట్టాల్సి వచ్చిన లాక్‌డౌన్‌ కరెంట్‌ బిల్లుల బకాయిలు భయపెడుతున్నాయి. అయినప్పటికీ అలవాటైన వ్యాపారాన్ని వదిలి పోలేక, సొంత థియేటర్ల యజమానులు మాత్రం కష్టం మీదనే హాళ్ళు నడుపుతున్నారు. తెనాలి, చిలకలూరిపేట మొదలు అనేక కేంద్రాలలో కొంతమంది పాతకాలపు రీలు ప్రింట్లతో, కొందరు పెన్‌ డ్రైవ్‌లతో ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, ‘మనుషులంతా ఒక్కటే’ లాంటి పాత ఎన్టీఆర్‌ సూపర్‌ హిట్లను ప్రదర్శిస్తూ, ఆశాజనకంగా వ్యాపారం సాగిస్తుండడం విశేషం. పబ్లిసిటీ అందుబాటులో ఉన్న అలాంటి ఓల్డ్‌ హిట్‌ చిత్రాలు ఈ కష్టకాలంలో ఆపద్బాంధవులయ్యాయి. అలాగే, తెరిచిన కొన్ని మల్టీప్లెక్సులు, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు కరోనాకు ముందు రిలీజైన లేటెస్ట్‌ పాత సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి, కరోనా దెబ్బతో ఈ సంవత్సరం దక్కిన అతి కొద్ది హిట్లు – అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’, మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్‌ ‘భీష్మ’, వగైరా. తక్షణమే కొత్త సినిమాలేవీ రిలీజుకు లేక ఈ పాత హిట్లే తాజాగా ఓపెనైన థియేటర్లకూ, ప్రేక్షకులకూ దిక్కయ్యాయి. షో ఖర్చులు రాకపోయినా, ఒకవేళ ఖర్చులు పోనూ రెండు, మూడు వేల లాభమే వస్తున్నా సొంత థియేటర్లున్నవాళ్ళు రిస్కు చేస్తున్నారు. ప్రేక్షకులు భారీయెత్తున రాకపోయినా, అసలంటూ థియేటర్లకు రావడాన్ని మళ్లీ జనానికి అలవాటు చేయడమే లక్ష్యంగా ఈ కొద్ది హాళ్ళు నడుస్తుండడం గమనార్హం. 

జనాన్ని రప్పించడం కోసం...
కాగా, ఇప్పుడు తెలంగాణలోనూ హాళ్ళు తెరిచిన వారం తరువాత ఈ డిసెంబర్‌ 11న ‘కరోనా వైరస్‌’ సినిమాతో దర్శక, నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మ జనం ముందుకు రానున్నారు. లాక్‌ డౌన్‌ మొదలైన తొలి రోజుల్లోనే తక్కువ రోజుల్లో, అతి తక్కువ యూనిట్‌తో, దాదాపు ఒకే ఇంట్లో, తన శిష్యుడి దర్శకత్వంలో వర్మ నిర్మించిన చిత్రం ఇది. వివిధ భాషల్లో డబ్బింగ్‌ చేస్తూ, అన్ని పనులూ పూర్తయినా, చాలాకాలంగా రిలీజ్‌ చేయకుండా వర్మ ఆపిన ఈ చిత్రం ఇప్పుడీ అన్‌ లాక్‌డౌన్‌ వేళ ఎన్ని థియేటర్లలో, ఎంత భారీగా రిలీజవుతుందో చెప్పలేం. అయితే, హాళ్ళు తీయగానే రిలీజైన తొలి చిత్రమనే క్రెడిట్‌ దక్కించుకొనేలా ఉంది. అదే రోజున హిందీ చిత్రం ‘ఇందూ కీ జవానీ’ రిలీజుకు సిద్ధమవుతోంది. ఆ తరువాత సరిగ్గా రెండు వారాలకు డిసెంబర్‌ 25వ తేదీ, క్రిస్మస్‌ నాడు సాయిధరమ్‌ తేజ్, నభా నటేశ్‌ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ తొలి పెద్ద సినిమాగా థియేటర్లలో రానుంది. 

అయితే, కరోనా అనంతరం సోషల్‌ డిస్టెన్స్, మాస్కుల న్యూ నార్మల్‌ ప్రపంచంలో థియేటర్లకు ఏ మేరకు జనం వస్తారు, ఏ సినిమాలు ఏ మేరకు వసూళ్ళు తెస్తాయన్నది ఇప్పటికీ కోట్ల రూపాయల ప్రశ్నే. ఇంట్లో కూర్చొని టీవీలో ఓటీటీ చూడడానికి కొద్ది నెలలుగా అలవాటుపడిపోయిన జనాన్ని ఇంటి నుంచి హాలుకు తీసుకురావడం ఇప్పుడో పెద్ద సవాలు. పేరున్న పెద్ద స్టార్ల సినిమాలు వస్తే కానీ, జనం హాళ్ళకు క్యూలు కట్టేలా లేరు. అలాంటి సినిమాలు రావడానికి కనీసం సంక్రాంతి సీజన్‌ దాకా ఆగాల్సిందే. అందుకే, కొత్త సినిమా కంటెంట్‌ లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఇటీవల ఓటీటీల్లో వచ్చి హిట్టయిన సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ లాంటి సినిమాలను ఇప్పుడు హాళ్ళలో రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేటెస్ట్‌గా ఓటీటీలో పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకున్న ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రాన్ని కూడా పరిమితంగానైనా హాళ్ళలోకి తీసుకువద్దామంటే, 60 రోజుల గడువు నిబంధన ఉన్నట్టు సమాచారం. 

ఆటకు సగటున పాతిక టికెట్లే!
మరోవైపు ఇప్పటికే అనేక కష్టనష్టాలతో అల్లాడుతున్న సినిమా వ్యాపారానికి, మరీ ముఖ్యంగా ఎగ్జిబిటర్‌ సెక్టార్‌ అయిన సినిమా హాళ్ళకు కరోనా గట్టి దెబ్బే కొట్టింది. ఒక్క హైదరాబాద్‌లోనే బిజీ సెంటర్లలో కనీసం 12 నుంచి 15 పేరున్న సినిమా హాళ్ళు ఇప్పుడు శాశ్వతంగా మూతబడ్డాయి. గోడౌన్లుగా, కల్యాణమండపాలుగా మారిపోయాయి. ఆంధ్ర ప్రాంతంలోనూ ఇదే దుఃస్థితి. పెరిగిన ఖర్చులు, తగ్గిన సీటింగ్‌ కెపాసిటీ, కరోనా కాలంలో క్యాంటీన్‌ ఫుడ్‌ పట్ల జనం అనాసక్తి లాంటి అనేక కారణాల మధ్య అన్ని ప్రాంతీయ భాషా సినీసీమల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. హాళ్ళు తెరిచినా, జనం పెద్దగా రావడం లేదు. తమిళనాట నవంబర్‌ 10వ తేదీ నుంచే హాళ్ళు తెరవడం మొదలుపెట్టారు. ఇప్పటికి మూడు వారాలు గడిచినా, అక్కడి ప్రసిద్ధ మల్టీప్లెక్సుల్లో ఆటకు సగటున పాతిక టికెట్లే తెగుతుండడం గమనార్హం. సింగిల్‌ స్క్రీన్లలో కూడా ప్రభుత్వం అనుమతించిన సగం సీటింగ్‌ కెపాసిటీలో సైతం 20 నుంచి 25 శాతమే నిండుతున్నాయని చెన్నై సినీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. 

సంక్రాంతి సీజన్‌కైనా..?
జనం రావాలంటే, పెద్ద తారల సినిమాలు రిలీజవ్వాలి. కానీ, పదుల కోట్ల ఖర్చుతో తీసిన భారీ బడ్జెట్‌ సినిమాలను ఈ సగం సీటింగ్‌ కెపాసిటీ టైములో హాళ్ళలో రిలీజ్‌ చేస్తే, నిర్మాతలకూ, బయ్యర్లకూ గిట్టుబాటు కాదు. కాబట్టి, తమిళనాట విజయ్‌ ‘మాస్టర్‌’ లాంటి భారీ చిత్రాలను రానున్న సంక్రాంతికి సైతం రిలీజ్‌ చేయకపోవచ్చని టాక్‌. తెలుగునాట కూడా ఇదే డైలమా నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌ రిలీజుల రేసులో పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’, రామ్‌ ‘రెడ్‌’, రానా ‘అరణ్య’, రవితేజ ‘క్రాక్‌’, ఆ పైన వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’, నాగ చైతన్య ‘లవ్‌ స్టోరీ’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌’ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, కరోనా సెకండ్‌ వేవ్, ఈ డిసెంబర్‌లో హాళ్ళు మరిన్ని తెరిచాక ‘సోలో బ్రతుకు సో బెటర్‌’ లాంటి చిత్రాలకు వచ్చే జనం స్పందనను బట్టి ఈ రిలీజుల్లో మార్పులు చేర్పులు తప్పేలా లేవు. అందుకే, ఇది ఒక రకంగా పెళ్ళి కుదిరితే కానీ పిచ్చి కుదరదు... పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కుదరదు లాంటి పరిస్థితి. జనం రావాలంటే పెద్ద సినిమాలు రావాలి. పెద్ద సినిమాలు రిలీజు కావాలంటే, హాళ్ళలో ఫుల్‌ కెపాసిటీ జనం కావాలి. మరి, కరోనాకు టీకా వచ్చేలోగానే ఈ పరిస్థితి మారేందుకు సినీ వ్యాపారంలో మధ్యంతర మార్గం మరేదైనా దొరుకుతుందేమో చూడాలి. ఇప్పుడు ఎలాగోలా థియేటర్లు ఓపెన్‌ కావడం మాత్రం ఆ ప్రయత్నంలో ఓ తొలి అడుగు అనుకోవచ్చు.
– రెంటాల జయదేవ 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా