Mumbai Rains: 25 లక్షల నష్టం.. అయినా: నటుడు

23 Jul, 2021 20:26 IST|Sakshi

ముంబై: భారీ వర్షాల దాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వానలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునగగా... ఎంతో మంది నిరాశ్రయులవుతున్నారు. ఆర్థిక, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలో తాను కూడా వర్షాల కారణంగా భారీగా నష్టపోయినట్లు హిందీ టీవీ నటుడు కుశాల్‌ టాండన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తన రెస్టారెంట్‌ ధ్వంసమైందని, సుమారు 25 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నాడు.

కాగా కుశాల్‌ టాండన్‌ 2019లో ‘‘ఆర్బర్‌ 28’’ పేరిట రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. హార్దిక్‌ పాండ్యా, సొహైల్‌ ఖాన్‌, సిద్ధార్థ్‌ శుక్లా, లులియా వంటూర్‌, నియా శర్మ వంటి సెలబ్రిటీలు ఆరంభ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, కొన్ని రోజులు వ్యాపారం బాగానే జరిగినా, కరోనా మహమ్మారి దెబ్బకు రెస్టారెంట్‌ మూతపడింది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నా వర్షాల దాటికి అతడి రెస్టారెంట్‌ ధ్వంసమైంది. 

ఈ విషయాల గురించి కుశాల్‌ మాట్లాడుతూ... ‘‘కోవిడ్‌ వల్ల వ్యాపారం కుదేలైంది. లాక్‌డౌన్‌ కారణంగా రెండుసార్లు రెస్టారెంట్‌ మూతపడింది. సడలింపులు ఉన్నా.... ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేవారు కాదు. ఇప్పుడేమో భారీ వర్షాలు.. రెస్టారెంట్‌ డ్యామేజ్‌ అయ్యింది. 23-25 లక్షల నష్టం. ఏం చేయాలో అర్థంకావడం లేదు’’ అని వాపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేసిన కుశాల్‌... వర్షం కురిసిన సమయంలో వాచ్‌మెన్‌, గార్డులు అక్కడ లేకపోవడం మంచిదైందంటూ ప్రస్తుత పరిస్థితులను వివరించాడు.

మరిన్ని వార్తలు