‘రియాపై ఒత్తిడి పెంచి.. వారిద్దరిని విడదీయండి’

5 Aug, 2020 15:31 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముంబై డీసీపీ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ బంధువు, హరియాణా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు.. రియా మీద ఒత్తిడి పెంచాల్సిందిగా తనను కోరారని తెలిపారు. వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని తనను అభ్యర్థించారని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే... డిప్యూటీ పోలీస్ కమిషనర్ పరమ్‌జిత్‌సింగ్ దహియా ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. ‘సుశాంత్ బావ, హరియాణా పోలీస్‌ సీనియర్ ఐపీఎస్ అధికారి ఓపీ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నాతో ఒక విషయం చెప్పారు. రియా చక్రవర్తిని అనధికారికంగా పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి.. ఆమెపై ఒత్తిడి తేవాల్సిందిగా నన్ను కోరారు. రియా, సుశాంత్‌ను తన కంట్రోల్‌లో పెట్టుకుందని అతడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కనుక రియాను సుశాంత్‌ జీవితం నుంచి తప్పించాలి. అందుకే ఆమె మీద ఒత్తిడి తీసుకురండి. వారి మధ్య ఉన్న బంధాన్ని వీడదీయండి’ అని ఓపీ సింగ్‌ తనతో చెప్పారన్నారు దహియా. (బాలీవుడ్‌తో సంబంధాలు నిజమే: ఆదిత్య ఠాక్రే)

అయితే ఇందుకు సంబంధించి సుశాంత్‌ కుటుంబం తమకు లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించలేదని దహియా తెలిపారు. ఫిబ్రవరి 18, 25 తేదీలల్లో వాట్సాప్‌ సందేశాల ద్వారా ఓపీ సింగ్‌ తనకు అనధికారిక అభ్యర్థన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 5న సింగ్ ముంబైకి వచ్చారని.. తన రాక గురించి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు తెలియజేయమని కోరారు అన్నారు. అంతేకాక మిరాండా అనే వ్యక్తిని ఎటువంటి ఫిర్యాదు, దర్యాప్తు లేకుండా ఒకరోజు పోలీసు కస్టడీలో ఉంచాలని ఓపీ సింగ్‌ తనను అభ్యర్థించినట్లు దహియా చెప్పారు. అయితే అందుకు తాను అంగీకరించలేదని ఫిర్యాదు లేకుండా ఎవరినీ పోలీస్ స్టేషన్‌కి పిలిచి తన అదుపులో ఉంచడం సాధ్యం కాదని తెలిపానన్నారు. అంతేకాక ఇది నిబంధనలకు వ్యతిరేకమని ఓపీ సింగ్‌కు తెలియజేశానన్నారు. దహియా ఏప్రిల్‌ 1 వరకు బాంద్రా ప్రాంత మండల పోలీసు అధిపతిగా ఉన్నారు.

మరిన్ని వార్తలు