Vir Das: కమెడియన్‌తో సహా నెట్‌ఫ్లిక్స్‌పై కేసు నమోదు.. కారణం అదే..!

8 Nov, 2022 17:40 IST|Sakshi

బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వీర్ దాస్, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యంపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అశ్విన్ గిద్వానీ. దీంతో కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. స్టాండ్-అప్ కమెడియన్ వీర్ దాస్, మరో ఇద్దరు వ్యక్తులతో పాటు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. 

అసలు కారణం ఏమిటంటే?: బాలీవుడ్ నిర్మాత అశ్విన్ గిద్వానీతో అక్టోబర్ 2010లో ఒక షోను నిర్మించేందుకు వీర్‌ దాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే జనవరి 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో వీర్ దాస్ కొత్త షో ప్రోమోను గిద్వానీ చూశారు. అందులోని కంటెంట్‌లో తన షో నుంచి కొన్ని మార్పులు చేసి కాపీ కొట్టారని నిర్మాత గిద్వానీ అరోపిస్తున్నారు. కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులను ఆశ్రయించారు. దీనిపై నవంబర్ 4న కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని..కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని, భారతదేశాన్ని ప్రపంచానికి చెడుగా చూపుతుందని ఆరోపిస్తూ వీర్ దాస్ ప్రదర్శనను రద్దు చేయాలని కోరుతూ 'హిందూ జనజాగృతి సమితి' సైతం సోమవారం బెంగళూరులోని పోలీసులను ఆశ్రయించింది. గతేడాది కూడా దాస్ వీడియోలపై కొందరు పోలీసు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హాస్యనటుడు తన వ్యాఖ్యలు దేశాన్ని అవమానించేలా లేవని ఒక ప్రకటన విడుదల చేశాడు.

మరిన్ని వార్తలు