Anup Rubens: రోజుకి 20 గంటలు పని చేశాం

8 Jan, 2022 07:19 IST|Sakshi

‘‘బంగార్రాజు’ లాంటి పెద్ద సినిమాకి చాలా సమయం పడుతుంది. అయితే నాలుగు నెలల్లోనే షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయాలని నాతోపాటు సాంకేతిక నిపుణులందరూ పని చేశారు. రీ రికార్డింగ్‌ కోసం రోజుకు 20 గంటలు పని చేశాం’’ అని సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ అన్నారు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీ శెట్టి కాంబినేషన్‌లో కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనూప్‌ రూబెన్స్‌ విలేకరులతో చెప్పిన విశేషాలు..

‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా మ్యూజికల్‌గా బ్లాక్‌ బస్టర్‌ అయింది. ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘బంగార్రాజు’ పాటలతో ఆ సినిమా పాటలకు పోలికలు పెడతారు. ‘‘సోగ్గాడే చిన్నినాయనా’తో మనకు ఓ బెంచ్‌ మార్క్‌ ఉంది.. దాన్ని ‘బంగార్రాజు’తో రీచ్‌ అవ్వాలి’’ అని నాగ్‌ సార్‌ అన్నారు. ప్రేక్షకుల అంచనాలు అందుకునేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించి సంగీతం ఇచ్చాను. ∙‘బంగార్రాజు’ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఒక్క పాట కూడా వెస్ట్రన్‌ టైప్‌లో ఉండదు. అన్నీ కూడా ట్రెడిషనల్‌గా, పల్లెటూరి వాతావరణంలోనే ఉంటాయి.

ఈ సినిమా కోసం కల్యాణ్‌ కృష్ణ చాలా కష్టపడ్డారు. ఎక్కడా టెన్షన్‌ పడకుండా ఓ టార్గెట్‌ పెట్టుకుని ఇంత పెద్ద సినిమాను పూర్తి చేయడం చాలా కష్టమైన పని. క్వాలిటీ, మ్యూజిక్, ఎడిటింగ్, సీజీ వర్క్‌.. ఇలా ఎక్కడ కూడా రాజీ పడలేదు. ∙‘బంగార్రాజు’లో ఇప్పటి వరకు విడుదలైన ‘లడ్డుందా, నా కోసం, వాసివాడి తస్సాదియ్యా..’ పాటలకు మంచి స్పందన వచ్చింది. మరో మూడు పాటలను రిలీజ్‌ చేస్తాం. నాగార్జున సార్‌ సాంకేతిక నిపుణులకు మంచి ఫ్రీడమ్‌ ఇస్తారు. ఆయనతో పని చేయడం ప్రోత్సాహకంగా ఉంటుంది. నేను సంగీతం అందించిన ‘శేఖర్‌’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. విక్రమ్‌ కె.కుమార్‌తో చేస్తోన్న సినిమా ఫిబ్రవరిలో రిలీజ్‌ అవుతుంది.

మరిన్ని వార్తలు