రవితేజ గొప్ప నమ్మకాన్ని ఇచ్చారు..వందేళ్లైనా మర్చిపోను: భీమ్స్‌ సిసిరోలియో

6 Dec, 2022 09:34 IST|Sakshi

‘‘రవితేజగారితో ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రం చేశా. ఆయన ‘ధమాకా’ చిత్రానికి రెండోసారి అవకాశం ఇవ్వడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ‘బెంగాల్‌ టైగర్‌’కి మించిన పాటలు ‘ధమాకా’లో ఉన్నాయి. రవితేజగారు నాకు గొప్ప నమ్మకాన్ని ఇచ్చారు.. వందేళ్ల తర్వాత కూడా దీన్ని మర్చిపోను’’ అని సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో అన్నారు. రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ–అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో మాట్లాడుతూ– ‘‘రవితేజగారిని చూస్తే చాలు పాటలు, ప్రేమ, భక్తి పుడతాయి. భీమ్స్‌ పనైపోయిందనే కామెంట్లు విన్నప్పుడు అవకాశం ఇచ్చారు రవితేజగారు. ‘ధమాకా’కి రవితేజగారికి పాటల పూజ చేశానేమో అనిపిస్తోంది. నా కెరీర్‌లో కొంత గ్యాప్‌ వచ్చింది.. ఈ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్‌ చేసేలా పదిహేను సినిమాలు చేస్తున్నాను. వాటిల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌లోపు పది సినిమాలు రిలీజవుతాయి’’ అన్నారు.  

మరిన్ని వార్తలు